విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతి కోరుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక ఆధ్వర్యంలో శాసనసభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. యామజాల నరసింహమూర్తి సభాధ్యక్షన ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదల సమస్యల పరిష్కారం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక చేసిన పోరాటాలను అభినందించారు. ఈ పోరాట వేదిక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా తమ హక్కులను పొందగలిగారన్నారు. అగ్రవర్ణాల ప్రజలను గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడటం కారణంగా అగ్రవర్ణాలలోని పేదలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే న్యాయ నిపుణులతో సంప్రదించడం జరిగిందన్నారు. వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మరీ అందరికీ న్యాయం చేకూరేలా జీవో ఇచ్చారన్నారు. కేంద్ర నిబంధనలను సైతం సడలించారన్నారు. అంతేకాకుండా వెనువెంటనే ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. మరోవైపు ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలులోకి వస్తుందని ఏపీపీఎస్సీ ప్రకటించడం సంతోషకరమన్నారు. దీని ద్వారా అగ్రవర్ణాలలోని యువతకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈబీసీ నేస్తం పేరుతో అగ్రవర్ణ పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించనున్నట్లు మల్లాది విష్ణు గారు వెల్లడించారు. ఈ పథకం ద్వారా.. 45 – 60 ఏళ్లలోపు వయసున్న వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 750 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు అందజేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక సభ్యులు కృషి చేయాలన్నారు.
అనంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యులు మల్లాది విష్ణు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మల్లాది విష్ణు ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాదని, ఆయన అన్ని కులాల వారికి ఆత్మీయులని చెప్పుకొచ్చారు. అగ్రవర్ణ పేదల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ప్రతిపక్షాలు కుట్రలు చేసే అవకాశం ఉందన్నారు. కనుక జీవోను ప్రతిపక్షాల కుట్రల నుంచి, కోర్టు పక్షుల నుంచి కాపాడే విధంగా చూడాలని మల్లాది విష్ణు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.
మరొక కన్వీనర్ జానపాముల నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ సాధారణంగా ప్రజా సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు అధికార పక్షాలు దూరంగా ఉంటాయని.. కానీ మల్లాది విష్ణు ధర్నా చౌక్ ను సందర్శించి తమ విన్నపాన్ని స్వీకరించడం మర్చిపోలేమన్నారు. అంతేకాకుండా ఆ వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. అగ్రవర్ణ పేదలకు న్యాయం చేకూరే విధంగా కృషి చేయడం సంతోషదాయకమన్నారు. గత తెలుగుదేశ ప్రభుత్వం కాపులను ఓసీలో, బీసీలో తెలియని సందిగ్ధంలో పడవేసిందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోందని తెలియజేశారు. అనంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక సభ్యులకు మల్లాది విష్ణు చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పోరాట వేదిక సభ్యులు రమణి రెడ్డి, ఆదిరెడ్డి రాఘవరావు, సరోజా రెడ్డి, మైలవరపు విజయ్ కుమార్, కృష్ణమూర్తి, వెంకట్రావు సహా 13 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.