-డివిజన్, మండల స్థాయిలో పిజిఆర్ఎస్ నిర్వహణ, ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సిఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా, అర్థవంతంగా సమస్యలకు పరిష్కారం చూపాలని, గ్రీవెన్స్ రీ ఓపెన్ కి తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలని, పీజీ ఆర్ ఎస్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, డివిజన్, మండల అధికారులతో వర్చువల్ విధానంలో కేసుల వారీగా పలు ఫిర్యాదులు సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పిజిఆర్ఎస్) లో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతగా, అర్థవంతంగా, నాణ్యతగా నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలని, పరిష్కరించలేనివి అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీ ఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు.
డివిజన్, మండల స్థాయిలలో ప్రజా ఫిర్యాదుల కొరకు పీజిఆర్ఎస్ కు వచ్చే ఫిర్యాదు దారులకు మర్యాద పూర్వకంగా, ఓపికగా, వారి అర్జీని సావధానంగా విని పరిష్కార దిశగా అర్జీదారుని సమస్యకు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సముచితంగా వారికి స్థానం కల్పించి గ్రీవెన్స్ డెస్క్ ఏర్పాటు ఉండేలా చూడాలని సూచించారు. అర్జీదారులకు కనీసం త్రాగు నీరు, కుర్చీలు ఏర్పాటు చేయాలని, అలాగే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీవెన్స్ స్వీకరణ అర్థమయ్యేలా ఫ్లో చార్ట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ర్యాంప్, వీల్ చైర్స్ ఏర్పాటు, వాటి వినియోగ సేవలు అందించాలని సూచించారు. పీజీఆర్ఎస్ నిర్వహణపై ముందస్తు సమాచారం ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం, అధికారులపై దృఢమైన విశ్వాసం ఏర్పడాలంటే వారి సమస్యలను సావధానంగా విని ప్రజల సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెన్షన్, రేషన్ కార్డులు, అన్నా క్యాంటీన్లు, దీపం 2.ఓ, వ్యవసాయ ఆధారిత అంశాలైన ధాన్యం కొనుగోలు, ఎరువులు, పురుగు మందులు, ధాన్యం ధరల స్థిరీకరణ, విత్తనాల పంపిణీ, రెవెన్యూ, మున్సిపాలిటీలు, పంచాయితీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖ, ఉచిత ఇసుక, మద్యం పాలసీ, గుంతలు లేని రోడ్లు, మహిళల పట్ల హింస, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కొరకు ఉన్నత పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, తదితర అంశాలపై తగు చర్యలు ఉండాలని సూచించారు. ప్రజా రవాణా సేవలు, వైద్య ఆరోగ్య సేవలు వంటి వాటి నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు.
జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతగా పరిష్కరించాలని, పలు ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. పీజీ ఆర్ ఎస్ కు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి అవసరం మేరకు కెపాసిటీ బిల్డింగ్ నిర్వహించాలని అన్నారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్ కు అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, వర్చువల్ విధానంలో డివిజన్, మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.