– రుణ మంజూరు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
– ఆర్థిక చేయూతకు, పర్యావరణానికి మేలుచేకూర్చే పథకమిది
– కరెంట్ జనరేషన్‌తో పాటు ఫ్యూచర్ జనరేషన్ బాగుకూ వీలుకల్పిస్తుంది
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలుచేసే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలుకు బ్యాంకులే వెన్నెముక అని.. రుణ మంజూరు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్‌పై బ్యాంకర్లతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా రాయితీతో ఇంటిపై సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకొని, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఈ పథకం కరెంట్ జనరేషన్‌తో పాటు ఫ్యూచర్ జనరేషన్ బాగుకు వీలుకల్పిస్తుందన్నారు. శిలాజ ఇంధనాలపై ఒత్తిడిని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరులను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.
రూ. 2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రూ. 20 వేలు లబ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని ఏడు శాతం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ. 32 వేలు ఆదా అవుతుందని వివరించారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ. 2.09 ఆదాయం పొందొచ్చని వివరించారు. సొంత ఇల్లు ఉండి, కరెంట్ కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులకు పథకంపై అవగాహన కల్పించడం జరిగిందని.. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున బ్యాంకు లింకేజీ దరఖాస్తులు వచ్చే అవకాశమున్నందున వాటిని సరళీకృత విధానాలతో త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రతివారం పథకంపై సమీక్ష నిర్వహించనున్నామని, పథకం అమల్లో జిల్లాను నెం.1లో నిలపడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా ప్రతి శాఖా 15 శాతం వార్షిక వృద్ధి సాధించాలని, ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన అవసరముందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, నోడల్ అధికారి ఎం.భాస్కర్, ఎల్డీఎం కె.ప్రియాంక, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో పి.లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు.