-పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళు
-పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల జీవనాడి
-2025, ఏప్రిల్ నాటికి 16, 400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలనీ లక్ష్యం
-ఆర్ అండ్ ఆర్ 2026 నాటికి పూర్తి చేయాలనీ ప్రణాళిక సిద్ధం,-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితులలోనూ 2026, అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అన్నారు. ఈ ప్రాజెక్ట్ ను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తో చర్చించామని, ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని 2026, అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్, ఈ సి ఆర్ ఎఫ్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారన్నారు.. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పనులు స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను జనవరి, 2వ తేదీన చేపట్టనున్నామని, అందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు 2026, మార్చ్ నెల నాటికి పూర్తిచేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారని, కానీ 2025, డిసెంబర్ నాటికి పూర్తిచేయవలసిందిగా కోరుతూ లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఈసి ఆర్ ఎఫ్ గ్యాప్ 1 పనులు ఫిబ్రవరి, 2026 నాటికి, గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్ లోగా పూర్తి చేస్తామన్నారు గాని, ముందుగానే పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను కోరుతూ లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ప్రాజెక్ట్ సివిల్ పనులను 2026 మే, , జూన్ నాటికి పూర్తి చేస్తే ఒక సీజన్ ను కోల్పోకుండా ఉంటామని, 2026 నుండి ప్రాజెక్ట్ లో నీటి నిల్వ ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను కోరామన్నారు. ప్రాజెక్ట్ కుడికాల్వ, ఎడమ కాల్వ కనెక్టివిటీ పనులు 2026, జూన్ లోగా పూర్తి చేయాలనీ, స్పిల్ ఛానల్ పనులు 2026, జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనులను అవసరమైన అనుమతులను త్వరితగతిన తీసుకువచ్చేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. 2014 నుండి 2019 తమ ప్రభుత్వ కాలంలో 72 శాతం పనులు పూర్తి చేశామని, గత ప్రభుత్వం కేవలం 3. 84 శాతం మాత్రమే పనులు పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చులో 2400 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి తెలియజేసి, మొదటి దశలో 41 . 15 లెవెల్ నిర్మాణానికి మొదటి దశలో 12 వేల 157 కోట్ల రూపాయలు సాధించామన్నారు. వాటిలో 2345 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన 7 లక్షల ఇరవై ఏడు వేల ఎకరాలు కొత్త ఆయకట్టు తో పాటు, మరో 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28 లక్షల మందికి త్రాగునీరు, 960 మెగా వాట్ల విద్యుత్ తో పాటు, విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, ప్రజలకు త్రాగునీటికీ 23 టీఎంసి ల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. , అందించవచ్చన్నారు. నదులు అనుసంధానంలో భాగంగా ఇప్పటికే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని అందించామన్నారు. అదేవిధంగా కృష్ణా నది నుంచి నాగార్జునసాగర్ కుడి మెయిన్ కెనాలకు, గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల బనగచర్ల కు నీటిని అందించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉత్తరాంధ్ర సంబంధించి వంశధార ప్రాజెక్టుకు అవసరమైన అన్ని కార్యాచరణ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామన్నారు. పోలవరం.. వంశధార ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కరువు రహిత జిల్లాలుగా రూపొందుతాయన్నారు. 2014 -19 ప్రాజెక్టు అభివృద్ధి కొరకు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేశానని, ప్రాజెక్ట్ ను క్షేత్రస్థాయిలో 28 సార్లు పరిశీలించి, 82 సార్లు వర్చువల్ గా సమీక్షించనున్నారు. అప్పర్, లోయర్ డాం గ్యాప్ 1, , గ్యాప్ 2, లోకి గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి 200 మీటర్లు దెబ్బతిన్నదన్నారు. దీనివల్ల 2400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. అప్పట్లో రు. 440 కోట్లతో పూర్తి చేస్తే , ప్రస్తుతం 990 కోట్లు ఖర్చుగా పరిస్థితికి చేరుతుందన్నారు. సాండ్ ఫిల్లింగ్ కి రు.350 కోట్లు అవుతుందన్నారు. దీని వలన 2400 కోట్లుఅదనంగా అవుతుందన్నారు. గతంలో రు.8242 కోట్ల నిధుల వస్తే.. రు.2342 కోట్ల రూపాయల నిధులను మళ్లించారన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79 శాతం పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పై నిపుణులతో 2 రోజులు వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొద్దిగా పూర్తి కావలసి ఉందని, తరవాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ను మార్చివేయడంతో సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో, 2020లో వచ్చిన అతి పెద్ద వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు.
మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు చిర్రీ బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, బడేటి రాధాక్రిష్నయ్య (చంటి), బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు ప్రభృతులు పాల్గొన్నారు.