-వొచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-గాడి తప్పిన ఆర్ధిక, పరిపాలన వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తాం
-ఎడీబి నిధులు, అమృత్ 2.0 నిధుల కేటాయింపు విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు
-ఫిబ్రవరి 2025 నాటికి పనులను ప్రారంభించి, రానున్న రెండేళ్ళ లో పూర్తి చేస్తాం
-చెత్త నుంచి సంపద సృష్టి, డంపింగ్ యార్డ్ లేని నగరాల అభివృద్ది కోసం అడుగులు
-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు స్వీయ ఆర్ధిక అభివృద్ది సాధ్యం కాదన్నది వాస్తవం అని ఆమేరకు వాస్తవికత ను అనుసరించి చర్యలు తీసుకోవాలని ఎవ్వరినీ ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. బుధవారం స్ధానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్ ఎమ్ సి కి చెందిన కార్యాచరణ ప్రణాళిక, 2027 గోదావరీ పుష్కరాలు నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలు పై కలెక్టరు పి. ప్రశాంతి, రుడా ఛైర్మన్, స్థానిక శాసనసభ్యులు, మునిసిపల్ కమిషనర్ లతో సమక్షంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించిన పనులు, ఇంకా చేపట్టవలసిన పనులు, త్రాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. వాటినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో పన్నులు వెయ్యని ఆస్తులకు పన్నులు వెయ్యడం, అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికీ పన్నులు విధించడం ద్వారా అన్నారు. గతంలో పన్నులు వెయ్యనవి, పన్నులు వసూలు కానీ వాటిపై దృష్టి పెట్టాలని, గతంలో టిడిపి హయంలో వాటిపై దృష్టి పెట్టడం వల్ల పన్నులు పెంచడం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. నగరపాలక సంస్థకు ఆదాయం సమకూర్చే వాటిపై నివేదిక అంద చెయ్యడం జరిగింది.
మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ వివరిస్తూ, మునిసిపల్ షాప్స్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు కొందరు సబ్ లేజ్ కి ఇవ్వడం జరిగిందని, వాటికీ సంబంధించి ఆక్షన్ వేయనున్నట్లు తెలిపారు. మురుగు డిసిల్టేషన్ పనులు యాంత్రీకరణ, మన్యువల్ గా సమాంతరంగా నిర్వహిస్తూ తెలిపారు. సఫాయి కర్మచారి పథకం కింద వాహనాలు సమకూర్చాలని, అందుకు సంబంధించిన లబ్దిదారులను గుర్తిస్తామన్నారు. అదే సమయంలో రానున్న 2027 గోదావరీ పుష్కరాలు నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన పనులు పై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ది కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా గతంలో ప్రతిపాదించిన పనులను ఫిబ్రవరి నెలలో పునర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 70 శాతం ఏడీబి ఋణం, మిగిలిన 30 శాతం ప్రభుత్వ గ్రాంటు విడుదల చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 70 శాతం నిధుల కేటాయింపు కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఏ డీ బి బ్యాంకు ముందుగా నిధుల విడుదల చెయ్యాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రానున్న 18 నెలల్లో ఆయా పనులు పూర్తి చెయ్యడం జరుగుతుందన్నారు.
పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి కొరకు అమృత్ 2.0 పథకం కింద రూ.8400 కోట్ల కేంద్రం గ్రాంటూ ఉండగా, ఇందులో కేంద్రం 36.70 శాతం గ్రాంటు ఇస్తున్నట్లు, మిగిలిన మొత్తాన్ని స్ధానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, 15 వ ఫైనాన్స్ నిధులను అనుసందానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారి పనులను చేపట్టడం ద్వారా 80 శాతం పైగా పనులను రానున్న రెండో ఏళ్ళల్లో పూర్తి చేసి, గోదావరీ పుష్కరాలు నాటికి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారం పన్నులు వెయ్యడం జరిగిందని, నిధులను ఆర్ధిక క్రమ శిక్షణ లేకుండా ఖర్చు చేశారన్నారు. గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్ధను, పరిపాలన ను గాడిలోకి తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి 130 లీటర్లు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికిఅదనపు పన్నులు వెయ్యడం జరగదని, అసెస్మెంట్ చెయడం, నగరపాలక సంస్థ పరిధిలో రు.79 కోట్ల బకాయిలు వసూళ్ళకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
2027 గోదావరీ పుష్కరాలు నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారని, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రు.1587.80 కోట్లతో, కొవ్వూరు డివిజన్ పరిథిలో రూ.280.90 కోట్ల తో ప్రతిపాదనలను సిద్ధం చేశారని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించనున్నట్లు తెలియ చేశారు. మరో 15 రోజుల్లో జిల్లాకి చెందిన అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
2014లో నిర్వహించిన పుష్కరాల సమయంలో పురపాలక మంత్రిగా ఉండి, 2 వేల కోట్ల రూపాయలతో నాలుగు మాసాల్లో అభివృద్ది పనులు చేపట్టి, పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మూడు సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు డ్రైయిన్స్, అంతర్గత రహదారులు, త్రాగునీరు, మురుగునీరు, వర్షపు నీరు పారుదల వంటి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో సంబంధిత శాఖల వారి సమీక్షించి డిపిఆర్ సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలపై భారం పడకూడదని లక్ష్యంతో 2014-19 మధ్యకాలంలో ఒక్క పైసా కూడా టాక్స్ రూపంలో పెంచలేదన్నారు. పురపాలక సంఘాలకు రు. 1500 కోట్ల రూపాయలు టాక్స్ రూపంలో వస్తుందని, అండర్ అసైన్మెంట్, అసైన్మెంట్ కానివి, వాటర్ టాక్స్ సంబంధిత వసూలు కానీ పన్నులు ప్రజలు, సంస్ధలు చెల్లించడం ద్వారా రు. 750 కోట్ల ఆదాయం పెరగటంతో పాటు మొత్తం రు. 2100 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రు.79 కోట్ల బకాయిలు వసూలు చెయ్యాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటుగా 40 కోట్లు బకాయిలు ఉన్నాయని, ఇప్పటివరకు 9 కోట్లు వసూళ్ళు చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు వసూలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.
పురపాలక సంఘాల అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికతో వెళుతున్నామని మంత్రి నారాయణ తెలియ చేశారు. చెత్త నుండి సంపద విద్యుత్ ఉత్పాదక దిశగా రాజమహేంద్రవరం, కాకినాడ మధ్య ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కడప, అనంతపురం మధ్య ఒక్క ప్రాజెక్టును ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. నెల్లూరు.. గూడూరు మధ్య ఏర్పాటు చేసే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు 15 రోజుల్లో టెండర్లు కూడా పిలుస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం వంటి నగరాల్లో వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టులను సమర్ధవంతంగా అమలు జరుగుతున్నట్లు తెలిపారు. పురపాలక సంఘాల ద్వారా రాష్ట్రంలో ప్రతిరోజు 7 వేల టన్నుల చెత్తను సేకరిస్తున్నా మన్నారు. గత ప్రభుత్వం పురపాలక సంఘాలకు ఇవ్వాల్సిన రు. 3,200 కోట్ల రూపాయల నిధులు ఇవ్వకుండా నిలుపుదల చేయటంతో అవి అభివృద్ధి కుంటుపడిందన్నారు.
విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రానున్న జూన్, జూలై మాసాల్లో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ఈ ప్రక్రియపై ఇప్పటికే సంబంధిత అధికారులతో పలు సమీక్షలు నిర్వహించామన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు. అమరావతి లో రు. 45 వేల కోట్ల చేపట్టనున్న ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి గాను టెండర్ల ప్రక్రియనులో త్వరలో ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్, ఆర్ఎంసి ప్రత్యేక అధికారి పి ప్రశాంతి గోదావరీ పుష్కరాలు, నగరంలో రహదారుల అభివృద్ధి, మురుగు నీరు, వ్యర్థాల నుంచి ఆదాయ వనరులు అంశాలపై వివరించగా,నగరపాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతిపాదించిన పనులను వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఆర్ఎంసి ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణచౌదరి, ఆర్ ఎమ్ సి అధికారులు, రుడా, ఇతర సమన్వయ అధికారులు పాల్గొన్నారు.