-పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు,వసతి గృహ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షించదగినదని, వసతి గృహాల్లో పిల్లలను బాధ్యతగా తమ సొంత పిల్లలను చూసుకునే విధంగా చూసుకోవాలని, అలాగే వసతి గృహాల మరమ్మత్తులు నాణ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో, ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో గౌ.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ శాఖ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల మరమ్మత్తులకు 810 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు గాను 132.96 కోట్ల రూపాయల ను మంజూరు చేసి నాణ్యతగా చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేశారని తెలిపారు. మన జిల్లాలో 55 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల మరమ్మత్తులకు గాను 6.34 కోట్ల రూపాయలను కేటాయించారని తెలుపుతూ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అవసరమైన మరమ్మత్తులు మాత్రమే చేపట్టాలని, నాణ్యతగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సదరు వసతి గృహాలలో మరుగుదొడ్లు రిపేరీ అందులో రన్నింగ్ వాటర్ ఉండేలా ఏర్పాటు, ప్రతి కొళాయికి ట్యాప్ ఉండేలా, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బుల ఏర్పాటు, కిటికీలకు దోమల మెష్, అన్ని గదులకు తలుపులు, గదులలో లీకేజ్ లేకుండా మరమ్మత్తులు, ఫ్లోరింగ్ మరమ్మత్తులు, బాలికల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్ వంటివి మంజూరు మేరకు మరమ్మత్తు పనులని చేపట్టి నాణ్యతగా ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకం పనులను ఒప్పుకునేది లేదని తప్పకుండా సంబంధిత అధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ పై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. వసతి గృహాలలో పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి వారి వసతి కొరకు ప్రభుత్వం కేటాయించిన నిధులు పిల్లల వసతి గృహాల మరమ్మత్తులకు వినియోగించాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ మరమ్మతుల కొరకు APEWIDC ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో సద్వినియోగం చేసి పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. వసతి గృహాల మరమ్మత్తు పనులను కొంత ఆలస్యమైనా సరే, కానీ తప్పకుండా నాణ్యతగా పనులు ఉండాలని ఏదైనా పొరపాట్లు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సదరు మరమ్మత్తు పనులను ప్రజా ప్రతినిధులు వాటి పురోగతిని, నాణ్యతను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి వారు తెలిపారని అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులను కేటాయించి నందుకు పలువురు విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ఈడబ్ల్యుఐడీసీ బాల సుబ్రమణ్యం రెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.