– సాంకేతికత తోడుగా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు
– భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
– పకడ్బందీగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం
– పారిశుద్ధ్యానికీ అత్యంత ప్రాధాన్యం
– అత్యాధునిక డ్రోన్ల వినియోగానికి ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షా విరమణలకు వివిధ శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని.. దీక్షా విరమణల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని టీమ్ ఎన్టీఆర్ విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, విద్యుత్, ఇరిగేషన్, మత్స్య, సమాచార, పౌర సబంధాల శాఖ, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రోజుకు దాదాపు లక్ష మంది చొప్పున మొత్తం ఆరు లక్షల వరకు భవానీ భక్తులు వచ్చేందుకు అవకాశమున్నందున పొరపాట్లకు తావులేకుండా భక్తుల సౌకర్యానికి పకడ్బందీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుంటూ భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సమన్వయ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కంట్రోల్ రూమ్‌లో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇందుకు జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు తదితరాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. వీఎంసీ ఇందుకు ప్రణాళికాయుత ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైతే పక్క జిల్లాల నుంచి వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గిరిప్రదర్శన ప్రాంతం, క్యూ లైన్లు, ఇరుముడుల పాయింట్లు, హోమ గుండాలు, ఘాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటుపైనా అధికారులకు సూచనలిచ్చారు. రాజీవ్‌గాంధీ పార్కు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, బబ్బూరి గ్రౌండ్స్, టీటీడీ స్థలం (కుమ్మరిపాలెం), సితార సెంటర్, లోటస్ పక్కన (పున్నమి ఘాట్), బీఆర్టీఎస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు.
పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థ ద్వారా నిరంతర సూచనలు:
భవానీ భక్తులకు విక్రయించేందుకు దాదాపు 20 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. టోల్ గేట్ నుంచి కొండపైన రిసెప్షన్, టోల్ గేట్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్, వినాయక గుడి నుంచి బొడ్డు బొమ్మ సెంటర్.. ఇలా 26 కేంద్రాల వద్ద పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరం సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కొండపైన, కొండ దిగువ ప్రాంతాల్లో భక్తులకు ఉపయోగపడేలా సూచనల బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఎరుపు వస్త్రాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా ప్రత్యేక కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మహిళా భక్తులు వస్త్రాలు మార్చుకునేందుకు సౌకర్యార్థం సీతమ్మవారి పాదాలు వద్ద 10, పున్నమి ఘాట్ వద్ద 2, భవానీ ఘాట్ వద్ద రెండు గదులు అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద కేశఖండన శాలలు అందుబాటులో ఉంటాయని వివరించారు. 20 వైద్య శిబిరాల ద్వారా సేవలందించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన, దిగువన, గిరిప్రదక్షిణ మార్గంలో మొత్తం నాలుగు అంబులెన్సులు ఏర్పాటుచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్లలో స్విమ్మర్లు, బోట్లు, లైఫ్ జాకెట్ల ఏర్పాట్లకు సంబంధించి మత్స్య శాఖ అధికారులకు సూచనలు చేశారు.
లా అండ్ ఆర్డర్, భద్రతా నిఘా, పార్కింగ్ ఏర్పాట్లు తదితరాలను పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వివరించారు.
వివిధ శాఖల అధికారుల పటిష్ట సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేసినట్లు భవానీ దీక్షా విరమణలను కూడా విజయవంతం చేయడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో కేఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం.రత్నరాజు, డీసీపీ గౌతమిశాలి, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్యతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.