ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన, 90 రోజుల్లో ఇండ్లపట్టా అర్జీలను పెండింగ్ లేకుండా గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఈ క్రాప్ బుకింగ్ , హౌసింగ్ , స్పందనఅర్జీలు, 90 రోజుల ఇళ్ల పట్టా దరఖాస్తులు. కోవిడ్ థర్డ్ వేవ్ ముందస్తు ప్రణాళిక తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం లో వచ్చిన అర్జీలను గడువుతేదీలోగా పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ దరఖాస్తులు పెండింగ్ ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. 90 రోజుల్లో ఇండ్ల పట్టాకు సంబంధించిన అర్జీలను విచారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వీటిపై ఆర్డివో లు ఎంపీడీవోలు, తహాసిల్దార్లతో సమీక్షించి సకాలంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో లేబర్ టర్న్ అవుట్ పెరగాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున డెల్టా, మెట్ట ప్రాంతాలలో కూలీలకు పనులు కల్పించటంలో వారం రోజుల్లోగా ప్రగతి చూపాలని కలెక్టర్ ఆదేశించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ ఫిట్టింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్ మూడు రోజుల్లో నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. ఉపాధి హామీలో చేపట్టిన గ్రామ పంచాయతీలు, రైతు భరోసా కేంద్రాలు,వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ లను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో తక్షణమే అప్లోడ్ చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకొని వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. ఈనెల 31వ తేదీ వరకు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఇప్పటివరకు తీసుకున్న మొదటి, రెండో డోస్, ఇంకనూ తీసుకొని వారి వివరాలకు సంబంధించిన డేటాను సేకరించాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కల్పించవలసిన మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ ప్లాంట్ లు, సిలిండర్లు, ఐసియు బెడ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవి, లేనిది నమోదు చేయవలసిన వివరాలను రేపటికల్లా పూర్తిచేయాలన్నారు. ఇ క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరినాట్లు పూర్తయినందున వివరాల నమోదు సోమవారంలోగా పూర్తి కావాలని, తదుపరి వరినాట్లతో సమానంగా ఇ క్రాప్ నమోదు ఒకేసారి జరగాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, నిర్మాణాలు జరుపుకునేందుకు ముందుకొస్తున్న లబ్ధిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ప్రారంభించాలన్నారు. అర్బన్ పరిధిలో నిర్మాణాలు జరుపుకుంటున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్లలలో పనిచేసే స్టాఫ్, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని భవనాలు త్వరితగతిని నిర్మిస్తే రోగులకు వైద్య సదుపాయాలను సకాలంలో అందుబాటులోకి తీసుకు రావచ్చునని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు హిమాన్ష్ శుక్లా, బి ఆర్ అంబేద్కర్, సూరజ్ ధనుంజయ్, పద్మావతి, డిఅర్వో వి. డేవిడ్ రాజు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags Eluru
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …