Breaking News

కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి…

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా పని చేశాయని అదే క్రమంలో మూడో తరంగాన్ని ఎదుర్కోవటంలో తమదైన పాత్రకు సిధ్దంగా ఉండాలని సూచించారు. విజయవాడ రాజ్ భవన్ లో మూడో తరంగ నివారణపై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అన్న అంశంపై శుక్రవారం ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. ఈక్రమంలో స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ పలు సూచనలు చేస్తూ టీకాలు పొందని వ్యక్తులను చైతన్యవంతం చేయాలని, అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. మొదటి, రెండవ తరంగం అనుభవాలతో ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్‌లు, పిపిఇ కిట్‌లు మొదలైన వాటిని పూర్తి స్ధాయిలో సమీకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా అనేక మంది ప్రాణాలు రక్షించబడ్డాయన్నారు. కొత్త తరంగం వచ్చిన ప్రతిసారి మనం ఎదుర్కోవలసిన సమస్యలు విభిన్నంగా ఉంటున్నాయని, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి మూడవ తరంగ నివారణలో సహాయపడతాయని గౌరవ హరిచందన్ అన్నారు. సామాజిక, మతపరమైన సమావేశాలు వద్దని, జనసమూహాలతో కలిసేటప్పుడు ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్త పోకడలతో అభివృద్ది చెందుతున్న కరోనా మునుపటి కంటే వేగవంతమైన వ్యాప్తిని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారని గుర్తు చేసారు. కరోనా వచ్చినప్పటికీ టీకా ద్వారా ఆసుపత్రి పాలవకుండా కాపాడుకోగలమన్నారు. ప్రారంభోపన్యాసం చేసిన గవర్నర్ వారి కార్యదర్శి, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కరోనా కారణంగా సమాజం మునుపెన్నడూ చూడని ఆందోళనకరమైన పరిస్ధితిని ఎదుర్కుంటుందన్నారు. అసంఘటిత రంగంలోని ప్రజలు, పేదలు మహమ్మారి కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారని ఆందోళన వ్యక్తం చేసారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ­మంగళగిరి) డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి మాట్లాడుతూ కరోనా తొలి, మలి విడతల వ్యాప్తి వల్ల దాని నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలు తెలుసుకున్నారన్నారు. సామాజిక సమావేశాలకు దూరంగా ప్రజానీకం ఉండాలని, వస్త్ర ముఖ ముసుగులు కరోనా సంక్రమణ విషయంలో తక్కువ రక్షణను అందిస్తాయని, సాధ్యమైనంత వరకు ఎన్95 మాస్క్ లు వాడాలని సూచించారు. కార్యక్రమంలో దాదాపు 15 ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎపి శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఫరీడా, రోటరీ క్లబ్ నుండి రామారావు, భారత్ స్కౌట్స్ ,గైడ్స్ ప్రతినిధి గంగా భవాని, గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ ప్రతినిధి విశాలా, యునిసెఫ్ యుఎన్‌డిపి ప్రతినిధి శ్రీనివాస్ రాజమణి, ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ ప్రతినిధి కిశోర్, వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు డాక్టర్ కీర్తి, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీరామ్, వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ ట్రస్ట్ నుండి దేవరాజన్, విజయ్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి సంధ్య, అపార్డ్ నుండి తిరుపతి రెడ్డి, ఏంజెల్ గ్రామీణ, పట్టణాభివృద్ది సంక్షేమ సంస్థ తరుపున శ్రీనివాసరావు, లీడ్స్ నుండి నాగేందర్ రావు వెబినార్‌లో పాల్గొన్నారు. కరోనా కాలంలో కోవిడ్ రోగుల కోసం అయా సంస్ధలు చేసిన సహాయం గురించి వివరించారు. తదుపరి వారు అమలు చేయదలచిన కార్యాచరణ, మూడవ తరంగ నివారణకు సంబంధించిన భవిష్యత్తు వ్యూహాలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో గవర్నర్ సంయిక్త కార్యదర్శి ఎ. శ్యామ్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *