Breaking News

గత రెండు సంవత్సరాల్లో వివిధ పథకాల క్రింద రూ. 6646 కోట్లు గిరిజనులకు అందించాం…

-అటవీ హక్కుల చట్టం క్రింద 2 లక్షల 28 వేల ఎకరాల పోడుభూమికి సంబంధించి గిరిజనులకు పటాలందించాం…
-ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో గిరిజనులకు వివిధ పథకాల కింద రూ. 6646 కోట్లు లబ్ధి చేకూర్చామని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమింపబడిన  సకట బుల్లిబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడ మొగల్రాజపురంలోని రాష్ట్ర కార్యాలయంలోని (ట్రైకార్ ) బుధవారం ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిధిగా పాల్గొనగా ఛైర్మన్ గా సకట బుల్లిబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాలలో వారి ఎదుగుదలకు ప్రాముఖ్యతనిస్తూ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో 6646 కోట్లు గిరిజనులకు లబ్ధి చేకూరిందని, ఇంత భారీ స్థాయిలో గిరిజనులకు ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని మంత్రి అన్నారు. రూ. 8 వేల కోట్లతో ట్రైబల్ సబ్ ప్లాన్ ను అమలు చేస్తున్నామని, రూ. 746 కోట్లతో గిరిజన ప్రాంతాలలో వైద్యసదుపాయాలు మెరుగుపరుచుటలో భాగంగా డా. వైయస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. భూమిలేని గిరిజనులకు రెండు ఎకరాలు పోడుభూమిని పట్టాలుగా అందించి వ్యవసాయానికి అనువుగా ఉండే భూమిగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలో 2 లక్షల 28 వేల ఎకరాల భూమిని అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు పంపిణి చేసామని మంత్రి అన్నారు. 100 నుండి 200 యూనిట్లు వరకూ గిరిజనులు గృహావసరాలకు వినియోగించే విద్యుత్తు ఖర్చును ప్రభుత్వమే భరించి గిరిజనులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదని మంత్రి అన్నారు. విజయనగరం జిల్లా కురుప్పాంలో రూ. 153 కోట్లతో ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను, గిరిజనులు సాగుచేసి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ సేకరిస్తుందని దీనిలో భాగంగా తేనె, చింతపండు, కుంకుడుకాయలు, నన్నారి ఉత్పత్తులు, కాఫీ, రాజ్ మా, పసుపు, రాగి, జీడిపప్పు, తదితర ఉత్పత్తులను గిరిజనులకు మద్దతు ధర అందించి గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ కొనుగోలు చేస్తున్నదని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ రూ. 450 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిర్వహించిందని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం కారణంగా ఏర్పడిన రక్త హీనతతో అనేకమంది బాలింతలు, శిశువులు మరణిస్తున్నారనే విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని దీనిలో భాగంగా గిరిజన ప్రాంతాలలో బాలింతల కోసం అలాగే పిల్లల కోసం గిరి గోరుముద్దలు, బాలసంజీవని, పోషకాహారబుట్ట లాంటి ప్రత్యేక పోషకాహార పధకాలను ఏజెన్సీ గ్రామాలలో అమలు చేస్తున్నామని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన ప్రాంతాలలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రూ. 450 కోట్లతో విద్యాసంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాలను కలుపుతూ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రైకార్ ) ఛైర్మన్ సకట బుల్లిబాబు మాట్లాడుతూ గిరిజనులకు సముచిత స్థానం కల్పించి వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, సామాన్య కార్యకర్త అయిన నన్ను ఛైర్మన్ గా నియమించుటే ఇందుకు ఉదాహరణ అని, నా పై ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని నా జీవితాంతం గిరిజనులకు సేవలు అందించేవాడిగా ఉంటానని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమం ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకే నేరుగా ప్రభుత్వ పధకాలు అందుతున్నాయని ఆయన అన్నారు.
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతగల ప్రతీ వ్యక్తికీ ప్రభుత్వ పథకాలు అందేలా ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన రెడ్డి పాలన సాగిస్తున్నారని ఈకార్యక్రమాల్లో నేను భాగస్వాముడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని బుల్లిబాబు అన్నారు. గిరిజన ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా అనేక స్వయం ఉపాధి పధకాలను గిరిజన యువతీ యువకులకు అందించి తద్వారా వారు ఉపాధి పొందేలా ఈకార్పోరేషన్ పనిచేస్తున్నదని ఇందుకు నాసాయశక్తులా గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెంచేలా ఛైర్మన్ గా నేను కృషి చేస్తానని సకట బుల్లిబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రైకార్ ) మేనేజింగ్ డైరెక్టరు ఇ.రవీంద్రబాబు మాట్లాడుతూ ఈకార్పోరేషన్ ద్వారా గిరిజన యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నామని ఇంతవరకూ 701 ఫోర్ వీలర్స్ వాహనాలను అందించామని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాలలో కాంప్రహెన్సివ్ కాఫీ ప్రాజెక్టు క్రింద లక్ష ఎకరాలలో రూ. 526 కోట్లతో కాఫీ తోటలను అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఇంతవరకూ 60 వేల ఎకరాల్లో కాఫీ తోటల ప్లాంటేషన్ చేపట్టామని రవీంద్రబాబు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ లైవ్ లీహుడ్ ప్రాజెక్టులను అమలుపరుస్తున్నామని దీనిలో భాగంగా 4 వేల కుటుంబాలను గుర్తించి పశుసంపదకు సంబంధించిన గోకులం యూనిట్లను ఏర్పాటుచేశామని దీనిద్వారా పాలఉత్పత్తిని సాధించుటే లక్ష్యంగా ఈయూనిట్లు పనిచేస్తాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో గిరిజన యువతీ యువకులకు అనేక పధకాల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా ఈకార్పోరేషన్ పనిచేస్తుందని మేనేజింగ్ డైరెక్టరు ఇ. రవీంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనరు పి.రంజిత్ భాషా, పాడేరు శాసనసభ్యురాలు  కె. భాగ్యలక్ష్మి, స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *