Breaking News

సెస్సులు, టోల్‌గేట్లతో ప్రజల జేబులకు చిల్లులు పెట్డడం మానండి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం ప్రజల జేబులకు చిల్లులు పెట్టి, జనంపై పెనుభారాలు మోపే విధంగా సెస్సులు వేసి, టోల్‌ గేట్లు ఏర్పాటుచేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చే 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు ఖర్చు అంచనాతో ఎపీలోని 1,500 కిలోమీటర్లమేర రహదారులను అభివృద్ధి చేసేందుకు హైబ్రిడ్‌ పద్ధతిలో పనులకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయి మూడేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులో తొలి ఏడాది 600 కిలోమీటర్లు, రెండో ఏడాది 600 కిలోమీటర్లు, మూడో ఏడాది 300 కిలోమీటర్ల చొప్పున రహదారులను నిర్మించాలని, ఇందులో రూ.4 వేల కోట్ల వరకు ప్రభుత్వం భరించగా, మిగిలిన 60 శాతం రూ.7761 కోట్ల ఖర్చును కాంట్రాక్టు సంస్థ భరిస్తూ, ఆ ఖర్చును ప్రభుత్వం ఏటా దశల వారీగా వడ్డీతో కలిపి 16 సంవత్సరాలలో చెల్లించేందుకు ప్రతిపాదనలు చేసింది.
‘హైబ్రిడ్‌’ రహదారి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం వెచ్చించే రూ.4వేల కోట్ల నిధుల సమీకరణ కోసం ఆర్‌టిసికి చెందిన భూములు, స్థిరాస్థులను లీజుకు ఇవ్వడంతోపాటు, పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున సెస్సు విధించి ఏటా రూ.732 కోట్లుÑ ఖనిజాలు, గనుల నుంచి 10 శాతం సెస్సు వసూలు ద్వారా ఏటా రూ.441 కోట్లుÑ మోటార్‌ వెహికల్‌ ట్యాక్స్‌పై 10 శాతం సెస్సు ద్వారా ఏటా కనీసం 350 కోట్లుÑ ఓడ రేవులకు వచ్చే కార్గోపైనా, రిజిస్ట్రేషన్‌ చార్జీలపై రోడ్డు సెస్సు కూడా విధించి తద్వారా ఈ ప్రాజెక్టుకు నిధులు రాబట్టేందుకు చూడడం దుర్మార్గం. అంతేకాకుండా కాంట్రాక్టు సంస్థ రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్లు ఏర్పాటుచేసి, ఏటా సుమారు రూ.375 కోట్లకుపైగా టోల్‌ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది.
గతంలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్లు ఏర్పాటుచేసి టోల్‌ వసూలు చేయాలనే ప్రతిపాదనకు ప్రతిపక్ష పార్టీల నుండి, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వగా వెనక్కు తగ్గింది. ఇదే ప్రతిపాదనను మరింత భారీ అంచనాతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి తీసుకువస్తోంది. కేవలం 1500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కోసం రూ.22 వేల కోట్లు వ్యయం చేయడం, ప్రజల నుంచి సెస్సు వసూలు, టోల్‌గేట్లు పెట్టడం వంటి ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్‌, ప్రైవేటు శక్తులకు మేలుచేకూర్చేలా నేలవిడిచి సాముచేస్తూ వేలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసే చర్యలకు పాల్పడడం తగదు. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే రూ.82 వేల కోట్ల అంచనా వేసిన బనకచర్ల`పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుమతి రాకపోవడంతో వెనక్కు తగ్గింది. పిపిపి పద్ధతిలో మెడికల్‌ కాలేజీలను, టూరిజం ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకంపై రూ.30 వేల కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల భారాలు మోపిన చంద్రబాబు సర్కార్‌ రహదారుల నిర్మాణం పేరుతో మరో రూ.22 వేల కోట్ల గుదిబండను మోపాలనుకోవడం సరైందికాదు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర రహదారుల అభివృద్ది కోసం చేపడుతున్న హైబ్రిడ్‌ ప్రాజెక్టు వలన ప్రజలపై భారం లేకుండా చూడాలి. సెస్సులు పెంచడం, టోల్‌గేట్లు ఏర్పాటుచేసి టోల్‌టాక్స్‌లు విధించడం వంటి చర్యలను విరమించుకోవాలి. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను, భూములను ప్రభుత్వ ఆధీనంలో ప్రజోపయోగాల నిమిత్తం మాత్రమే వినియోగించాలేగాని లీజుల పేరుతో బడా పెట్టుబడి దారులకు అప్పనంగా అప్పగించాలన్న యోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రజలపై భారాలు మోపడాన్ని విరమించుకోకపోతే ఉద్యమించక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలో శ్రీవిద్య లగ్జరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *