-పాల్గొన్న టి.డి.జనార్ధన్, నిమ్మల రామానాయుడు
దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త :
దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ పోలిట్యూరో సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాల వారు పాల్గొన్న ఈ వేడుకలో ముందుగా క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. ఆ తర్వాత వక్తలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ.. క్రిందటేడాది దుబాయ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు తాను హాజరయ్యానని ఈసారి కూడా ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. నిరంతరం ప్రజల మధ్య బిజీగా గడిపే మంత్రి నిమ్మల రామానాయుడు ఇక్కడ స్థిరపడిన తన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చారని తెలిపారు. ప్రపంచంలో జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటారని పేర్కొంటూ.. ప్రపంచ మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప వరాలు-ప్రేమ, కరుణ, క్షమ, శాంతి, సామరస్యం వంటి మహెన్నతమైన మానవీయ గుణాలని పేర్కొన్నారు. ప్రేమతో ఎవరినైనా జయించవచ్చుని ఏసుక్రీస్తు రుజువుచేశారని, శాంతితోనే అభివృద్ధి సాధ్యమని తెలియజెప్పారని.. వాటిని అనుసరిస్తున్న ప్రపంచ దేశాలు అభివృద్ధిలో వడివడిగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలను ప్రతిఒక్కరూ ఆచరిస్తే నిత్యజీవితంలో సమస్యలు లేకుండా జీవించడం సాధ్యపడుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన శ్యామ్ తదితరులను టి.డి.జనార్ధన్, నిమ్మల రామానాయుడులు అభినందించారు.
Prajavartha Online Telugu News