గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
‘మురసు’ తుఫాన్ కారణంగా గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో గుంటూరు నగర పాలక సంస్థ (GMC) అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 530 మందికి ఆశ్రయం కల్పించారు. బాధితులకు ఆహారం, అల్పాహారం, తాగునీరు, దుప్పట్లు అందించాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు మోటార్ పంపులు, జేసీబీలను సిద్ధం చేయడంతో పాటు తాగునీటి సరఫరా, రహదారులపై కూలిన చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు GMC కాల్ సెంటర్ 0863 2345103 నంబర్‌ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నగర యంత్రాంగం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
