ఎన్నికల విధుల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ పురపాలక ఎన్నికలు–2026 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత కీలకమని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఓటర్ల గుర్తింపు, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, ఓటు వేసే విధానం, బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ ముగిసిన అనంతరం అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. శిక్షణలో వివరించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తమకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు.

ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను శిక్షణ సమయంలో నివృత్తి చేసుకుని, పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అవసరమైన ముందస్తు అవగాహనతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధివిధానాలు, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎన్నికల సిబ్బంది శిక్షణ నోడల్ అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, ఎన్నికల అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.