Breaking News

రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ…

ఇదో గొప్ప కార్యక్రమం…
ఇళ్ల స్ధలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ఈరోజు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో చాలామంది శాససనభ్యులు అందరూ చక్కగా మాట్లాడారు. మంత్రి రంగనాథరాజుగారు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా వెళ్లి తిరుగుతూ.. నేను ఫలానా పని చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికి…
మామాలుగా ఎమ్మెల్యేలు ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెడితే నాకు పెన్షన్‌ రాలేదనో.. ఇల్లు లేదనో, ఫలానా స్కీం అందలేదనో, అర్హత ఉండి కూడా రాలేదనే రకరకాల ఫిర్యాదులు వినిపించే పరిస్థితి, ఎమ్మెల్యేలు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి శాసనసభ్యుడు సగర్వంగా, కాలర్‌ ఎగరేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి పథకం పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా జరుగుతుంది. పథకంలో అర్హత ఉంటే చాలు మన పార్టీయా, తన పార్టీయా అని చూసే కార్యక్రమం కూడా ఎక్కడా జరగడం లేదు. తన, మన భేదం కూడా చూపించడం లేదు. కులం, ప్రాంతం, మతం, చివరకి పార్టీ కూడా చూడకుండా ఇవాళ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

ఇళ్ల స్థలాలు–ఇళ్లు…
ఇటువంటి గొప్ప పరిస్థితుల్లో అన్నిటికన్న గొప్ప కార్యక్రమం ఇళ్ల స్ధలాలు, వాటిలో ఇళ్లు కట్టడం. ఈరోజు దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్ధలాల పట్టాల పంపిణీ చేయడంతో పాటు, తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇవి దేవుడి దయతో త్వరితగతిన పూర్తయిన తర్వాత ఈ 30.76 లక్షల అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరి చేతిలో రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లే. అంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది.
సొంత ఇల్లు ఉండాలని, కట్టుకోవాలని, దాని కోసం జీవితమంతా సంపాదించిన దాన్నంతా తీసుకుని కట్టుకోవాలని కలలు గనే కార్యక్రమం. సమాజంలో సొంత ఇల్లుతో వారికి స్టేటస్‌ వస్తుంది. భద్రతతో పాటు భరోసా కూడా వస్తుంది. ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఇటువంటి ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాలని ప్రభుత్వం అడుగులు వేసింది.

ఒక మహాయజ్ఞంలా..
పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా పేదరికంలో ఉండ ఇబ్బందులు పడుతున్న అగ్రవర్ణాలకు కూడా మేలు జరిపించే కార్యక్రమం జరుగుతుంది. పేదవాళ్లకు ఈ ఇళ్లపట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశారు. దీని కోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాలుగా సేకరించాం. ఈ భూమి విలువ కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. ఈ రూ.25 వేల కోట్ల విలువ చేసే భూమిని మనం 30.76 లక్షల అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం.

ఇళ్లు కాదు ఊళ్లు…
ఈ 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించి 2.62 లక్షల ఇళ్లు కూడా ఉన్నాయి. అందులోనూ అన్‌డివైడెడ్‌ షేర్‌ అప్‌ ల్యాండ్‌ వారికి వస్తుంది. కొత్తగా 17,005 కాలనీలు వస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్‌ గ్రామ పంచాయితీ సైజులో కనిపిస్తున్నాయి. అందుకే ఇవాళ ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నాం.
17,005 వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలిదశలో 10,067 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు కడుతున్నాం. మొత్తం రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దేవుడి దయ వల్ల ఈ స్ధాయిలో మన ఇళ్ల స్ధలాలు సేకరించడం జరిగింది. కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోదీకి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి.
17,005 కాలనీలలో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్‌ ఇటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్కూల్స్, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దీనికి కొద్ది సమయం పడుతుంది. ఓవర్‌ ఏ పీరియడ్‌ ఆఫ్‌ టైం, కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ పోతుంది.

అన్ని వసతులతో..చౌకలో…
గతంలో చంద్రబాబు హయాంలో కూడా కలిపి గమనించినట్లైతే.. ఇంటి విస్తీర్ణం రూరల్‌లో ఇంచుమించు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్రూం, లివింగ్‌ రూం, కిచెన్, బాత్రూమ్‌ కమ్‌ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ కూడా ఇంట్లో కనిపించే పరిస్థితి. పేదలకు అండగా ఉండేందుకు, అధికారులు చాలా జాగ్రత్తగా పని చేశారు. ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఎలా తగ్గించాలి? దాన్ని ఎలా తగ్గించగలిగితే పేదవాడికి మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని చెప్పి రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం.
అందులో భాగంగానే సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా డోర్లు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ సామాగ్రి వంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని తీసుకువచ్చాం. ఎందుకంటే సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ జరిగితే రివర్స్‌ టెండరింగ్‌ జరుగుతుంది, నాణ్యత కూడా నిర్ధారణ జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు కూడా నిర్ణయిస్తారు. దీనివల్ల పెద్ద ఎత్తున కొనుగోలు జరిగి ధరలు కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది.

తక్కువ ధరకే సిమెంట్‌…
ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ పడుతుంది. మామాలుగా మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. పేదలకు సంబంధించిన ఇళ్లకు మాత్రం సిమెంట్‌ కంపెనీలతో మాట్లాడి వారిని ఒప్పించి పీపీసీ సిమెంట్‌ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేటట్టు మాట్లాడాం. ప్రతి లబ్దిదారుడికి 20 టన్నుల ఇసుక అవసరమైతే అది కూడా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తున్నాం. దాదాపుగా 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను మార్కెట్‌ రేటు కన్నా తక్కువకే.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సరసమైన ధరకే తీసుకువచ్చే పరిస్థితిని కల్పించాం.

ఏమేర ఆర్థిక లావాదేవీలు…
30 రకాల వృత్తుల వారికి దీనివల్ల ఉఫాధి లభిస్తుంది. 15.60 లక్షల ఇళ్లకు సంబంధించి ఇళ్ల సామాగ్రితో పాటు కార్మికులకు లభించే ఉఫాది గమనిస్తే.. 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1250 కోట్ల ఇటుకులు ఇళ్ల నిర్మాణాలలో అవసరమయ్యే సామాగ్రి. ఇవన్నీ ఎకనామిక్‌ బూస్ట్‌ను తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల లబ్ధి జరుగుతుంది. వృత్తి నైపుణ్యం ఉన్న కార్మికులకు మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామ స్ధాయిలో రావడం వల్ల, గ్రామస్ధాయి ఎకానమీలో పెద్ద బూస్ట్‌ వస్తుంది. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

టిడ్కో ఇళ్లు…
టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
గతంలో ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటి నిర్మాణ వ్యయం రూ.6 లక్షలుగా లెక్క వేసి, అందులో రూ.1.5 లక్షలు కేంద్రం ఇచ్చే సబ్సిడీ, మరో రూ.1.50 లక్షలు రాష్ట్ర సబ్సిడీ పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే వారు. ఆ రుణానికి ఆ నిరుపేద కుటుంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది.
ఇవాళ అవే ఇళ్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి మరీ ఆ పేదలకు ఇస్తున్నాం. అదే విధంగా 365 అడుగుల ఇళ్లకు సంబంధించి కూడా ఆ లబ్ధిదారులకు మేలు చేస్తున్నాం. వారికి రూ.25 వేల సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే 430 చదరపు అడుగుల ఇంటికి కూడా రూ.50 వేల సబ్సిడీ ఇస్తూ మేలు చేస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మంచి చేస్తున్నాం.
టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. గత జనవరిలో ఆ ఇళ్ల పంపిణీ మొదలుపెట్టగా, వచ్చే డిసెంబరు నాటికి ఆ పంపిణీ పూర్తి చేస్తాం.

నాణ్యతా ప్రమాణాలు…
ప్రభుత్వ పని అంటే నాసిరకం అన్న పేరు పోయి, ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందన్న పేరు తెచ్చుకోవాలి. అది ఇప్పుడు జరుగుతోంది. ఆ సంకల్పంతోనే ఖర్చు ఎక్కువైనా సరే ఇళ్ల నిర్మాణంలో పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం.
కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించాం. అంతే కాకుండా అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు కూడా ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాము. వారు ఆ పని దగ్గరుండి చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు బిల్లులు…
గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం సరేసరి. చివరకు ఆ బిల్లులు చేయడం కూడా గగనమై పోయేది. కానీ ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి, ఎప్పటికప్పుడు దశల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం.

పుట్టగతులు ఉండవనే…
నిజానికి ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. అందుకు కారణం ఏమిటంటే, ఇళ్ల నిర్మాణం పూర్తయితే,జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది. తమ అడ్రస్‌ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ, కోర్టులను ఆశ్రయించడం వల్ల నా నియోజకవర్గం పులివెందుల, విశాఖతో సహా పలు చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

వచ్చే నెలలో విశాఖలో…
ఇటీవలే విశాఖలో భూముల సేకరణకు హైకోర్టు క్లియరెన్స్‌ ఇచ్చింది. దాంతో సన్నాహాలు చేయమని అధికారులను ఆదేశించాము. ఏప్రిల్‌లో అక్కడికి వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా, ఇంటి కాగితాలు కూడా ఇచ్చి, వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాము.

మిషన్‌ పూర్తి చేస్తాం…
ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే రెండేళ్ల ఈ మిషన్‌లో నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. కచ్చితంగా దాన్ని పూర్తి చేస్తామని గట్టిగా చెబతున్నాను.
ఇంటిని పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేసి, వారి ఫోటోతో సహా, ఆ పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనిదంటే అతిశయోక్తి కాదు. ఆ ఆనందమే మాకు శక్తి ఇస్తుంది. మమ్మల్ని నడిపిస్తుందని చెబుతూ.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా ఎన్నో మంచి పనులు చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సభలో ప్రసంగం ముగించారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *