– క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేందుకు అనువైన మార్గదర్శనం జరగాలని సూచన
– ఇందుకు అనుగుణంగా మూలాల నుంచి క్రీడావ్యవస్థను బలోపేతం చేయాలి
– ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ప్రైవేటు రంగం తమ బాధ్యతను నిర్వర్తించాలి
– గ్రామీణ, సంప్రదాయ క్రీడలకు పెద్దపీట వేయాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
– బెంగళూరులో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో క్రీడాసంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన వాతావరణాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ ప్రయత్నంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటుచేసి క్రీడావ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఆదివారం బెంగళూరులో ‘ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021’ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 200 విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన 4500 మంది యువ క్రీడాకారులను, క్రీడా ప్రముఖులు, ప్రైవేటు రంగం ప్రతినిధులు, ప్రభుత్వాధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో క్రీడలకు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలో ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహం ఒలింపిక్స్ లో ఆ దేశం సాధిస్తున్న పతకాల పట్టికలో కనబడుతోందన్నారు. ఇదే విధంగా మన దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా క్రీడాసంస్కృతిని ప్రోత్సహిస్తూ, వివిధ క్రీడల్లో అవసరమైన మౌలికవసతుల కల్పన ద్వారా పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, సామాజికవేత్తలు, ప్రముఖ క్రీడాకారులు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. క్రీడా మౌలికవసతుల నిర్మాణంతోపాటు సామర్థ్యమున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాసామర్థ్యాన్ని వెలికితీసి సానబెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఈ దిశగా కేంద్రం ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమం ఓ అద్భుతమైన ఆలోచన అన్న ఉపరాష్ట్రపతి.. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, అవసరమైన వసతుల కల్పన ద్వారా ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడించేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.
యోగాసనాలు, మల్లఖంబ వంటి దేశీయ క్రీడలతోపాటు 20 రకాల వివిధ క్రీడల్లో ఈసారి ఖేలో ఇండియా పోటీల్లో నిర్వహిస్తుండటాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి.. భారతీయ క్రీడలను ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. గ్రామీణ క్రీడల్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.
క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక సంతులనం పెరుగుతుందన్న ఉపరాష్ట్రపతి.. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవడం ద్వారా ఏ రంగంలోనైనా ఉత్తమఫలితాలు సాధించవచ్చన్నారు. ఆరోగ్యకరమైన పోటీలో భాగస్వాములయ్యేందుకు క్రీడలు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. అందుకే క్రీడలు, యోగా ను పాఠశాలల పాఠ్యప్రణాళికలో చేర్చడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, శారీరక, మానసిక సంతులనం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి వంటివి పెంపొందించవచ్చన్నారు. నూతన జాతీయ విద్యావిధానం – 2020 కూడా ఈ దిశగా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు.
ప్లాస్టిక్ వినియోగం లేకుండా, పునర్వినియోగ వస్తువులను వినియోగించడం కారణంగా ఈ క్రీడలు మొట్టమొదటి గ్రీన్ గేమ్స్ గా నిలిచిపోతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందుకుగానూ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమ సహ నిర్వాహకులు జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ యాజమాన్యాన్ని కూడా ఆయన అభినందించారు. క్రీడా సౌకర్యాలను మెరుగుపరచడం, క్రీడాకారులను ప్రోత్సహించడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి డాక్టర్ కేసీ నారాయణ గౌడ, పలువురు ప్రముఖులు, అధికారులు, క్రీడాకారులు, క్రీడా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.