Breaking News

ప్ర‌తి కుటుంబం సూర్య ఘ‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

– ప‌థ‌కంతో ఆర్థిక స్వావ‌లంబ‌న‌తో పాటు పర్యావ‌ర‌ణానికీ మేలు
– క‌రెంటు బిల్లుల భారానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు వీలు
– మిగులు విద్యుత్ ద్వారా ఆదాయాన్నీ ఆర్జించవ‌చ్చు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావిత‌రాల‌కు స్వ‌చ్ఛ‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించేందుకు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌తి కుటుంబం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాను నెం.1లో నిలిపి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లిలో పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంతో ల‌బ్ధి పొందుతున్న విశ్రాంత ఆర్ అండ్ బీ ఇంజ‌నీర్ ఏఆర్ఎస్‌పీ ప్ర‌సాద్ ఇంటిని సంద‌ర్శించారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం ద్వారా ఆయ‌న ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించారు. ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసుకోక‌ముందు, ప్ర‌స్తుతం వ‌స్తున్న క‌రెంటు బిల్లుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణానికి త‌ద్వారా ఆరోగ్య‌క‌ర జీవితానికి మేలుచేసే పున‌రుత్పాద‌క ఇంధ‌న వినియోగం దిశ‌గా ప్ర‌తిఒక్క‌రూ వెళ్లి, సౌర విద్యుత్‌ను ఉప‌యోగించుకోవాల‌నే ఉద్దేశంతో గౌర‌వ ప్ర‌ధాని, గౌర‌వ ముఖ్య‌మంత్రి సూర్య ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు తెలిపారు. ఈ ప‌థ‌కం 2024, ఫిబ్ర‌వ‌రి 15న ప్రారంభ‌మైంద‌ని.. ఇంటి పైక‌ప్పుపై రాయితీతో, అతి త‌క్కువ ఖ‌ర్చుతో సోలార్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేసుకొని క‌రెంట్ బిల్లుల భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌న్నారు. ఏఆర్ఎస్‌పీ ప్ర‌సాద్ ఇంటికి గ‌తంలో దాదాపు మూడు వేల వ‌ర‌కు క‌రెంటు బిల్లు వ‌చ్చేద‌ని.. ఇప్పుడు పూర్తిగా జీరో బిల్లు వ‌స్తోంద‌ని.. తాజా బిల్లును చూస్తే త‌న అవ‌స‌రాల‌కు స‌రిపోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వ‌డంతో రూ. 325 ప్ర‌భుత్వం నుంచి తిరిగి పొందే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. ప‌థ‌కం వ‌ల్ల ఏ మేర‌కు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో ఈ సంఘ‌ట‌న ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని.. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు కూడా సోలార్‌రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. సొంత ఇల్లు ఉండి, క‌రెంట్ క‌నెక్ష‌న్ ఉన్న‌వారెవ‌రైనా www.pmsuryaghar.gov.in ద్వారా సుల‌భంగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చ‌న్నారు. రూ. 2 ల‌క్ష‌ల విలువైన 3 కేడ‌బ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను రూ. 78 వేల రాయితీతో ఇంటి పైక‌ప్పుపై ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్నారు. రూ. 20 వేలు ల‌బ్ధిదారు వాటాపోను మిగిలిన మొత్తాన్ని త‌క్కువ వ‌డ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.

సూర్య ఘ‌ర్ చాలా మంచి ప‌థ‌కం: ల‌బ్ధిదారు, విశ్రాంత ఇంజ‌నీర్ ఏఆర్ఎస్‌పీ ప్ర‌సాద్
పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజ్లీ యోజ‌న ద్వారా అయిదు నెల‌ల కింద‌ట 3 కేవీ సామ‌ర్థ్య‌మున్న సోలార్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకున్నాన‌ని.. దీంతో చాలా ప్ర‌యోజ‌నం పొందుతున్నాన‌ని ప‌థ‌కం ల‌బ్ధిదారు, విశ్రాంత ఇంజ‌నీర్ ఏఆర్ఎస్‌పీ ప్ర‌సాద్ తెలిపారు. రూ. 78 వేల రాయితీ ల‌భించింద‌ని.. ఈ ప‌థ‌కం చాలా ఆనందాన్నిస్తోంద‌ని.. ఇది చాలా మంచి ప‌థ‌క‌మ‌ని అన్నారు. మిగులు విద్యుత్‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డం వ‌ల్ల తిరిగి ఆదాయం వ‌స్తోంద‌న్నారు. మ‌రో ఇద్ద‌రికి ఈ సౌర విద్యుత్ వ్య‌వ‌స్థ పెట్టించాన‌ని.. సామాజిక బాధ్య‌త‌గా మ‌రో ప‌ది మంది ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నం పొందేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రం త‌నిఖీ:
గుంటుప‌ల్లిలోని చెత్త నుంచి సంప‌ద త‌యారీ కేంద్రాన్ని త‌నిఖీ చేసి.. అక్క‌డి కార్య‌క‌లాపాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. వ‌ర్మీ కంపోస్టు త‌యారీ విధానాన్ని ప‌రిశీలించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌కు అత్యంత ప్రాధాన్యమిస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయి సిబ్బంది చెత్త నుంచి సంప‌ద త‌యారీ కేంద్ర కార్య‌కాలాపాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *