Breaking News

పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభం

-ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుగుణంగా సివిల్ పనులను వేగవంతం చేయాలి
-బోధనాసుపత్రి, కాలేజీ పనుల ప్రగతిని సమీక్షించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌
-ఈ నెలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కళాశాల సందర్శన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం (2026-27)లో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు మరియు వివిధ నిర్మాణాల పనులను వేగిరపరచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ దిశగా పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ మంగళవారంనాడు ప్రకటించారు. డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది నియామకాలు, కాలేజీ మరియు హాస్ట ళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై మంత్రి సచివాలయంలో రెండుగంటలకు పైగా సమగ్రంగా సమీక్షించి అధికారులకు తగు అదేశాలు జారీచేశారు. అవసరాల మేర‌కు భారీ స్థాయిలో వివిధ కేటగిరిలో జరగాల్సి ఉన్న సిబ్బంది నియామకాల తీరుపై ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల అవసరాలను, ఇప్పటివరకు జరిగిన నియామకాలపై ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. డీఎంఈ, డీపీహెచ్, గుంటూరు రీజినల్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగిన, జరగనున్న నియామకాల వివరాలను తెలుసుకున్న మంత్రి ఈ నెలాఖరులోగా నియామకాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో బోధనా సిబ్బందిని నియమించుకోవాలని మంత్రి సూచించారు.

సివిల్ పనుల్లో వేగం పెరగాలి

ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుగుణంగా ఎన్ఎంసీ ప్రమాణాల మేరకు పూర్తిచేయాల్సిన వివిధ భవనాల నిర్మాణ పనుల తీరును మంత్రి లోతుగా సమీక్షించారు. కొన్ని ప్రధానమైన నిర్మాణ పనులను మరింత వేగిరపరిచి, ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ యాజమాన్యంతో అక్కడిక‌క్క‌డే ఫోన్‌లో మాట్లాడి మే 20లోగా ప్రధాన నిర్మాణ పనులను పూర్తిచేయాల్సిన ఆవశ్యకతను తెలియచేశారు. కాలేజీ మరియు బోధనాసుపత్రులకు అవసరమైన పలు రకాల పరికరాలు మరియు ఫర్నిచర్ ఏర్పాటును సమీక్షించిన మంత్రి నిర్ణీత సమయంలో వీటిని ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

ఆ ప్రాంత ప్రజలకు తెలియచేయాలి

పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభంకానున్న విషయాన్ని ఆ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని, అందుబాటులోనికి రానున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేదిశగా వారిలో అవగాహన కల్పించాలని, అందుకు తగ్గ కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల ప్రజలు పిడుగురాళ్ల సర్వజన ఆసుపత్రికి వచ్చేందుకు అవసరాల మేరకు కొంతకాలం రవాణా సదుపాయం కల్పించాలని కూడా మంత్రి సత్యకుమాం యాదవ్ సూచించారు.
ఈ క‌ళాశాల నిర్మాణానికి రూ.500 కోట్ల‌తో ప‌రిపాల‌నాప‌ర‌మైన ఆమోదం ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఇదే క‌ళాశాల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌ధ‌కం (సియ‌స్ఆర్‌) కింద రూ.300 కోట్లు విడుద‌ల కాగా ఇందులో రూ.195 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది. మిగిలిన వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంది

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఇంఛార్జి డీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి, డీపీహెచ్ డాక్టర్ పద్మావతి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, ఏపీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ నెహ్రూ, గుంటూరు రీజినల్ డైరెక్టర్ శోభాదేవి, గుంటూరు డిఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *