-రెండో విడత లాటరీలో 10,453 మందికి సీట్లు కేటాయింపు
-వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండవ విడత లాటరీ ఫలితాల తుది జాబితా మంగళవారం (05.05.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 54,016 మంది అర్హులుగా పరిగణించామని, మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటర్ పరిధి లోపల ఉన్న 30,075 మంది విద్యార్థులు ఎంపిక కాగా, మిగిలిన 1నుండి 5 కి.మీ పరిధిలోని విద్యార్థులను రెండో విడత లాటరీలో భాగంగా 10,453 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు, https://cse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్, ఆదాయ, కుల, విద్యార్థి పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్ తదితర ధ్రువీకరణ పత్రాలతో 06.05.2026 నుండి 17.05.2026 లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు.
సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. సరైన కారణం లేకుండా పాఠశాల యాజమాన్యాలు అడ్మిషన్లు నిరాకరిస్తే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు)కు ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ల ద్వారా నిర్థారిస్తారు. పాఠశాల యాజమాన్యాలకు సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈవో, డీఈవో, ఆర్జేడీలను సంప్రదించాలన్నారు.
Prajavartha Online Telugu News