-సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల విన్నపం
-మెయింటెనెన్స్ ఛార్జీలను ఏసీ థియేటర్లకు రూ.15, నాన్-ఏసీకి రూ.7 పెంచాలని వినతి…పెద్ద సినిమాల అదనపు టికెట్ ధరలో 20% వాటా ఎగ్జిబిటర్లకు ఇవ్వాలని ప్రతిపాదన.. కరెంట్ బిల్లులు, ఆస్తి పన్ను రాయితీలపై వినతిపత్రం అందజేత
-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ని కలిశారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంటూ వినోదాన్ని పంచుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం మల్టీప్లెక్స్ ల పోటీ మరియు ఓటీటీల ప్రభావంతో మూతపడే దిశగా వెళ్తున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, కనీస నిర్వహణ ఖర్చులు భరించలేక ఎగ్జిబిటర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మంత్రి దుర్గేష్ కి వివరించారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న నాన్ ఏసీ మెయింటెనెన్స్ ఛార్జీ రూ.3 నుండి రూ.7కి, ఏసీ థియేటర్లకు రూ.5 నుండి రూ.15కి పెంచాలని కోరారు. తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు.పెద్ద బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం అనుమతించే అదనపు ధరలో 20 శాతం వాటాను థియేటర్ల నిర్వహణ కోసం కేటాయించేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. థియేటర్లకు కమర్షియల్ విద్యుత్ ఛార్జీల నుండి ఉపశమనం కలిగించాలని మరియు మున్సిపల్ ఆస్తి పన్ను తగ్గించాలని కోరారు.
ఎగ్జిబిటర్ల సమస్యలను సావధానంగా విన్న మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ.. “సినిమా రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, సింగిల్ స్క్రీన్లు తెలుగు సంస్కృతిలో ఒక భాగమని పేర్కొంటూ ఈ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సానుకూల పరిష్కారం లభించేలా కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్. ప్రసాదరావు (అలంకార్ ప్రసాద్), సభ్యులు గోరంట్ల బాబు(గోరంట్ల కాంపెక్స్, ఒంగోలు), గౌరీశంకర్ రాము(గుంటూరు గౌరీ శంకర్ థియేటర్)భగవాన్ (ఎస్పీ థియేటర్స్ జనరల్ మేనేజర్), ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News