ఉద్యోగ భద్రత సర్క్యులర్ 01/2019 అమలు చేయాలి : ఎంప్లాయీస్ యూనియన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యులర్ 01/2019ను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు.

శుక్రవారం హనుమాన్‌పేట దాసరి భవన్‌లో జరిగిన ఎన్టీఆర్ జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ, సర్క్యులర్‌కు విరుద్ధంగా విధించిన గత శిక్షలను సమీక్షించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను విరమించుకుని, ఆర్టీసీయే బస్సులను కొనుగోలు చేసి నిర్వహించాలని, మూసివేసిన నాలుగు డిపోలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను భర్తీ చేసి, కనీసం 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతుల ఖాళీల్లో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని కోరారు.

విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం నేపథ్యంలో రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఐఆర్‌పై ప్రకటన చేయకపోవడం పట్ల ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ తెలిపారు.

డిసెంబర్‌లో జరగనున్న సీసీఎస్ ఎన్నికల్లో యూనియన్ బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర, జోనల్, జిల్లా నాయకులతో పాటు తొమ్మిది డిపోలకు చెందిన సుమారు 300 మంది యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.