Breaking News

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం

నేటి పత్రిక ప్రజావార్త :

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర.

భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపంలో మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు.

ఓం నమో పాండురంగాయ..ఓం నమో పుండరీక వరదాయా..ఓం నమో నారాయణాయ..ఓం నమో ఆశ్రుత జన రక్షకాయ.. అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాధించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించడాని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది.

ఇక్కడ ఈ ప్రాంత ప్రజలచే చంద్రభాగా నదిగా పిలవబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలచరించడం ద్వారా సకల పాపాలను పక్షాళింప చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చంద్రబాగ నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికీ సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు. ఆ కారణం చేతన స్నానాధికాలు చేసిన భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు.

పాండుగరండి ఆలయానికి సరిసమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండలీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు. శ్రీ పాండురంగడు స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దం కాలం నుండే ఈ ఆలయాన్ని అభివ్రుద్ది చేసినట్లు తెలుస్తోంది. పుండరీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు,. ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజాద్రవ్వాలన్నింటిని సేకరించుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.

ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడువైపున చౌకమేళ మందిరం దర్శనం ఇస్తుంది. పాండురంగ స్వామి వారి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామి వారికి చేరవేస్తారని చెబుతుంటారు. గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చుని వున్న స్వామి వారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. పాండురంగస్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాము పాండురంగస్వామి వారి పాదాలను స్పర్శించి నప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఏదోతెలియని తృప్తి కలుగుతుంది.

పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి , నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రీ అని అనిపిస్తుంది. భక్తుల మీద ఆయనకున్న ప్రేమకు ఆనందంతో మన కళ్ళు చెమరిస్తాయి.ఇక్కడ స్వామివారిని తులసీదళాలతో పూజిస్తారు. ప్రక్కన వున్న ఉపాలయాల్లో రుక్మణి, సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామి వున్నారు. ఇక్కడ ఉన్న దేవతామూర్తుల పాదాలు స్పృశించి నమస్కరించు కోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో వున్న అమ్మవారి పాదాలు స్పృశించవచ్చు.

పుండరీకుని కధ: పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధంచెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు. శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు. నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి.

ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు. పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు. కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు. పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.

ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు. భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు. పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు. విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక. అందువలన అప్పటినుండి స్వామిని విఠలుడు అని పిలుస్తారు.

ఎలా చేరుకోవాలి?
విమానం మార్గం ద్వారా: సమీప విమానాశ్రయం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ వద్ద ఉంది.
రైలు మార్గం ద్వారా: పంధర్పూర్ రైల్వే స్టేషన్, క్రువువాడి జంక్షన్‌ ఈ ఆలయానికి దగ్గరగా ఉంటాయి.
రోడ్డు మార్గం ద్వారా: సోలాపూర్ నుండి
పందర్‌పూర్ ఆలయం 74 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మహారాష్ట్రలోని అన్ని రహదారి మార్గం ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

ఆలయ దర్శనం సమయాలు: ఉదయం 4:30 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *