విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 29 డివిజన్లలోనూ కూటమి విజయం ఖాయం

-మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకు భారీ మెజారిటీ తథ్యం: ఎంపీ కేశినేని చిన్ని ధీమా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి కూటమి పార్టీల తరఫున బలపరిచిన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాతో పాటు వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 11వ డివిజన్‌లో జనసేన, బీజేపీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి భాగం సాయి ప్రసాద్, 12వ డివిజన్‌లో జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి చెన్నుపాటి క్రాంతి శ్రీ, 17వ డివిజన్‌లో జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కోనేరు రాజేష్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని మొత్తం 29 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా భారీ మెజారిటీతో గెలుపొందడం తథ్యమని స్పష్టం చేశారు.ప్రజలు కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే విజయవాడ నగర రూపురేఖలను మార్చి, నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.విజయవాడ నగరంలో డ్రైనేజీ సమస్యతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ విజయవాడను సుందరమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.విజయవాడ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రధాన లక్ష్యమని, అందుకోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కేశినేని చిన్ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, చెన్నుపాటి గాంధీ, ఐలా ప్రతినిధులు, కార్యకర్తలు చిలకలపూడి లక్ష్మీ నరసింహ, కడియాల దుర్గాభవాని, మోటపర్తి వరలక్ష్మి, సుధీర్ మరియు ఆయా డివిజన్ డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు