-ఏబీ రాకతో విజయవాడకు మంచిరోజులు
-ప్రచారంలో జి ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర పాలక సంస్ధ ఎన్నికల్లో సీపీఐ, సీపీయం, కాంగ్రెస్, ప్రజాసంఘాలు బలపరిచిన స్వతంత్ర మేయర్ అభ్యర్ధిగా ఏబీ వెంకటేశ్వరరావు పోటీచేయడం శుభపరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడలోని దాసరి భవన్ నుండి ప్రారంభమైన ప్రచార యాత్రలో ఏబీతో పాటు ఆయన పాల్గొని 59, 63 డివిజన్లో పర్యటించారు. డప్పు వాయిద్యాలు, జెండాలతో కోలాహలంగా సాగిన యాత్రలో ఈశ్వరయ్య మాట్లాడుతూ గత పాలకులు హాయంలో అభివృద్ధి పేరుతో జరిగింది శూన్యమని, డివిజన్లలో ప్రజలు తాగునీటికి, డ్రైనేజీకి అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల ఏజెండాను విస్మరించి సొంత ఏజెండాలను అమలు చేసుకునే పనిలో పాలకులు ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రజలు చెల్లించే పన్నులను ప్రజాపాలనకు వినియోగికుండా జేబులు నింపుకుంటూ కమర్షియల్ పోలిటిషియన్లుగా అవతారమేత్తారని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నిక విజయవాడ మార్పుకు నాంది పలికాలని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు తీర్చేవారే నిజమైన ప్రజా ప్రతినిధులు అని స్పష్టం చేశారు. డివిజన్ల అభివృద్ధికి, నగర ప్రగతికి తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 59, 63 డివిజన్ అభ్యర్ధులు నక్కా వీరభద్రరావు, లంకా శశిరేఖ ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రచార యాత్రలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు సిహెచ్.బాబురావు, కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావులతో వివిధ పార్టీల నాయకులు, వందలాది కార్యకర్తలు, స్ధానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
