-విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి సంఘాలు ఐక్యంగా కృషి చేయాలి: డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (ఏపీఎస్జీఆర్ఈఏ) తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జిల్లా కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఏపీఎస్జీఆర్ఈఏ గత 43 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విశ్రాంత ఉద్యోగుల అనుభవం, సేవాభావం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్జీఆర్ఈఏ సంఘం ప్రతినిధులు, తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
