-నాయకులు, కార్యకర్తలకు డా. పసుపులేటి హరిప్రసాద్ దిశానిర్దేశం
పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త:
పుత్తూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, హరిప్రసాద్ ఎన్నికల కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కూటమి అధికారంలో ఉందనే భావనతో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తూ, ప్రతి వార్డులో 90 శాతం పోలింగ్ లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి వైసీపీ అనుసరించే వ్యూహాలను ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, ఆయా వార్డులకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలందరూ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు.
కూటమి అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వార్డులో ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల కార్యాచరణలో ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో పాటు జనసేన నాయకులు మెరుపుల మహేష్, కిరణ్ రాయల్, ప్రణిత్ పెనుమాదు తదితరులు పాల్గొన్నారు.
