స్థానిక సంస్థల్లో నూరుశాతం విజయమే లక్ష్యం

-జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలి
-గెలిపిస్తే గ్రామస్థాయి వరకు ‘ట్రిపుల్ ఇంజిన్’ అభివృద్ధి
-కూట‌మి అభివృద్ధి, సంక్షేమాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలి
-పశ్చిమ గోదావరి శ్రేణులకు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం

పాలకొల్లు/నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నూరుశాతం స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌ధ్యంలో మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ బుధ‌వారంనాడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ భాష్యం రామకృష్ణ, ప‌లువురితో విడివిడిగా పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లి గూడెం నియోజకవర్గాల్లో ఆయ‌న‌ పర్యటించారు. కూటమి తరఫున పోటీ చేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు కండువాలు కప్పిన మంత్రి గొట్టిపాటి వారిని అభినందించారు. స్థానిక‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో రెండేళ్ల‌లో జ‌రిగిన‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులు, కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే క్షేత్ర స్థాయిలో మ‌రింత వేగ‌వంత‌మైన‌ అభివృద్ధికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి నాయకత్వం ఉంటే ‘ట్రిపుల్ ఇంజిన్’ తరహాలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వేగంగా ప్రజలకు చేరుతాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి స్థానిక సంస్థల పాత్ర కీలకమని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. అమరావతి రాజధాని నుంచి మారుమూల గ్రామాల వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ‌ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తూనే, కూటమి ప్రభుత్వం గ‌త‌ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి గొట్టిపాటి చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే వైఎస్సార్‌సీపీ నుంచి వ‌చ్చే గొడ్డ‌లి పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇస్తే రాష్ట్రంతో పాటు స్థానికంగా కూడా అభివృద్ధి దెబ్బతింటుందని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

వెలిగొండలో నిమ్మల కృషి అభినందనీయం

వెలిగొండ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషిని మంత్రి గొట్టిపాటి ఈ సంద‌ర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. నెల‌కు మూడు సార్లు వెలిగొండ‌కు వెళ్లి ప్రాజెక్టు ప‌నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించేవార‌న్నారు. నిర్వాసితుల పరిహారం అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిమ్మల మాట్లాడి, సుమారు 40 రోజుల్లోనే రూ.950 కోట్ల మేర పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అదే విధంగా గ్రామాలు ఖాళీ చేస్తున్నవెలిగొండ‌ నిర్వాసితుల‌కు నెల రోజుల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌రాల‌ను కూడా అందించార‌ని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమికి బలమైన ప్రజాబలం ఉందన్నారు. వీట‌న్నింటినీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయంగా మార్చాల‌ని ఆయ‌న‌ కోరారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గ్రామస్థాయి నుంచి పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని కోరారు. కార్య‌క్ర‌మంలో పలువురు కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు.