-ప్రభావిత భవనాల యజమానులతో సమన్వయం చేసుకోవాలి.. పట్టణ ప్రణాళిక అధికారులకు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కాంట్రాక్టర్‌తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
గురువారం శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు నగరపాలక సంస్థ (జీఎంసీ) తరఫున తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కాంట్రాక్టర్ అవసరమైన సంఖ్యలో కార్మికులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వంతెన నిర్మాణం కోసం ప్రభావితమయ్యే భవనాల యజమానుల్లో అధిక శాతం మంది ఇప్పటికే అంగీకారం తెలిపారని, వారి నిర్మాణాలను తొలగించడంతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించినట్లు తెలిపారు.
మిగిలిన భవనాల యజమానులు కూడా ముందుకొస్తే వంతెన నిర్మాణ పనులను మరింత త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భవనాల యజమానులకు ఉన్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేస్తూ పట్టణ ప్రణాళిక అధికారులు వారితో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల కారణంగా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, పనులు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, ఏసీపీ రెహ్మాన్, పట్టణ ప్రణాళిక విభాగ సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
