రీపోలింగ్‌కు ఏమాత్రం తావులేకుండా పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

-ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
-బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, టెండర్ ఓట్లు, ఛాలెంజ్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సాధారణ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు, రీపోలింగ్‌కు తావులేకుండా అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కళా వేదికలో గురువారం సాధారణ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఒకే రోజు నిర్వహించనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఒత్తిడి, పోటాపోటీ వాతావరణం ఉండే అవకాశం ఉందని, అధికారులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత చిత్తంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రామాణిక కార్యాచరణ విధానాలనన తూచా తప్పకుండా పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రిసైడింగ్ అధికారుల కరదీపికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి దశలో అనుసరించాల్సిన విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు తలెత్తితే సొంత నిర్ణయాలు తీసుకోకుండా సంబంధిత ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను సక్రమంగా మడతపెట్టకపోవడం, వేలిముద్ర సిరా అంటుకోవడం వంటి కారణాలతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోయాయని గుర్తుచేశారు. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఓటర్లకు బ్యాలెట్ పేపర్ మడతపెట్టే విధానంపై ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ సమయంలో ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ప్రిసైడింగ్ అధికారులు నిబంధనల ప్రకారం ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సును ప్రిసైడింగ్ అధికారి నిరంతరం తన పర్యవేక్షణలో ఉంచుకోవాలని, ఓటర్లు బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకెళ్లకుండా, ఇతర కాగితాలను బ్యాలెట్ బాక్సులో వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ వెనుక ముద్ర వేసే సమయంలో అధికంగా ఇంకు పడకుండా, పేపర్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకుని అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. మొదటి విడత ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించి, తదుపరి విడతల ఎన్నికలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.సీతామహాలక్ష్మి, ఆర్డీఓ వెన్నెల శ్రీను, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి నాంచారారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.ప్రభాకరరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, విజయవాడ, నందిగామ డివిజనల్ పంచాయతీ అధికారులు రాఘవన్, లక్ష్మీ కుమారి, ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.