నైపుణ్యాలు, స్వయంఉత్పాదనతోనే వికసిత్ భారత్

-పి.బి. సిద్ధార్థలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశ యువ జనాభా వచ్చే పదేళ్లు పెరుగుతూనే ఉండడం ముఖ్యం కాదని, యువత నైపుణ్యాలు, సామర్ధ్యాలు పెరిగితేనే ఆర్థికవ్యవస్థలో అద్భుతాలు కనబడతాయని అదానీ గ్రూప్‌ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం సీఈఓ రాబిన్ భౌమిక్ అన్నారు.  పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో వికసిత్ భారత్ 7వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభసభ కానూరులోని పి.వి.పి. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాబిన్ భౌమిక్ మాట్లాడుతూ స్వయం ఉత్పత్తి, స్వయం సమృద్ధితోనే ఆత్మ నిర్భర భారత్ సాధ్యపడుతుందన్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే టెక్నాలజీ ఆధారంగా దేశ అభివృద్ధిని అంచనా వేయలేమని, ఆటోమేషన్ కాలంలో మనం సాంకేతికంగా ఎదగాలని, యువత ధోరణి మారాలన్నారు. యువత కాలాన్ని స్నేహితుడిగా భ్రమపడి సమయం వృథా చేసుకోవద్దని, సాధారణ తెలివితేటల స్థానంలో సాంకేతిక వ్యక్తిత్వం అలవరచుకోవాలన్నారు.
సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో అమరావతి న్యూఢిల్లీని అధిగమిస్తుందని, అదానీ గ్రూపు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అకాడమి జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలితప్రసాద్ మాట్లాడుతూ అధిక జనాభాపై చర్చ జరగాలని, జీఎస్టీ పన్ను విధానం వల్ల మధ్య తరగతికి లబ్ధి చేకూరలేదని విమర్శించారు. పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్  స్వాగతోపన్యాసం చేశారు. యువత, మహిళా, రైతు కేంద్ర బిందువుగా వికసిత్ భారత్ సత్ఫలితాలు సాధిస్తోందని పివిపి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా. కె.శివాజీబాబు అన్నారు. సిద్ధార్థలో అదానీ గ్రూప్ స్కిల్ సెంటర్ ప్రారంభించాలని అకడమిక్ అడ్వైజర్ ఆచార్య ఎల్. కె. మోహనరావు కోరారు. ఆంగ్ల విభాగాధిపతి డా.శ్రీలత స్వాగతం పలకగా, డీన్, సదస్సు కన్వీనర్ ఆచార్య రాజేష్ సి.జంపాల వందన సమర్పణ చేశారు. ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, కచ్  వర్సిటీ వీసీ ప్రొ.మోహన్ పటేల్, కార్యదర్శి ప్రొఫెసర్ అలోక్ కుమార్, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ దేవరాజ్.ఆర్, సింబోజియా గ్రూప్ డైరెక్టర్ డా. జి.ఎస్. రాణా, డైరెక్టర్ వేమూరి బాబూరావు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎకనామిక్స్ అసోసియేషన్ ప్రకటించిన రీసెర్చ్ అవార్డులను ఆర్.కె.మిశ్రా, ప్రొ. ఏ.ఏ షేక్. అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డును సిద్ధార్థ అకడమిక్ అడ్వైజర్ ప్రొ. ఎల్.కె మోహనరావులకు అందచేసి కార్యదర్శి డా.అలోక్ కుమార్ వారిని సత్కరించారు. ఈ సందర్భంగా 106 పరిశోధక పత్రాలతో కూడిన సావనీర్ తో పాటు పలు పుస్తకాలను రాబిన్ భౌమిక్ ఆవిష్కరించి రచయితలను అభినందించారు. అనంతరం గురువారం మధ్యాహ్నం పి.బి. సిద్ధార్థ వెబినార్ హాలులో కువెంపు వర్సిటీ (కర్ణాటక) విశ్రాంత వీసీ ప్రొ. బి.పి. వీరభద్రప్ప అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సమావేశంలో పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. అనంతరం స్టెల్లెన్‌బోష్ వర్సిటీ ప్రొఫెసర్ డా.ఆర్. కె. మిశ్రా దివంగత డా.ఐ.జి. పటేల్ స్మారక ఉపన్యాసం చేశారు. ఈ సదస్సు ఈ నెల 21 వరకు కొనసాగుతుంది.