-తొలుత విజయవాడ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్ కేంద్రం ఏర్పాటు
-ఐవీఎఫ్, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు. ఇతర సౌకర్యాల కల్పనకు రూ.1,011 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు
-సమీక్షా సమావేశంలో చర్చించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
-రోగుల అవసరాలకు తగ్గట్టు పూర్తి స్థాయి వెంటిలేటర్ల సదుపాయాన్ని కల్పించాలన్న మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అత్యంత ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ పరిశీలిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఐవిఎఫ్ సెంటర్లు, బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు, ఇతర అధునిక వైద్య సేవలను విస్తృతం చేసేందుకు రూ. 1,011 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో ముఖ్యంగా రోబోటిక్ శస్త్రచికిత్సలను బోధనాసుపత్రుల్లో దశలవారీగా ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. తొలిదశలో విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మలివిడతలో విశాఖ కేజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లోనూ రోబోటిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మంగళగిరిలోని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం నాలుగు గంటలపాటు జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పన, నిర్మాణాల పురోగతి, ఇతర ముఖ్యాంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.1,011 కోట్లతో అత్యాధునిక వైద్య సేవలు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ వివరించారు.
ముఖ్యమైన ప్రతిపాదనలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారిగా ఐదు సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతి బోధనాసుపత్రుల్లో వీటిని నెలకొల్పేందుకు రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
అరుదైన వ్యాధుల చికిత్స
విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రత్యేక అత్యుత్తమ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంచనా వ్యయం రూ.17 కోట్లు.
అవయవ మార్పిడి కేంద్రాలు
పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రంతోపాటు 11 పాత ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.163.52 కోట్ల వ్యయంతో అవయవ మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు
రూ.48 కోట్ల వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు బోధనాసుపత్రుల్లో బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాకుండా వృద్ధుల వైద్య కేంద్రం, క్లినికల్ స్కిల్స్ అండ్ సిమ్యులేషన్ కేంద్రాలు, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ కేంద్రాలు, స్పీచ్ అండ్ హియరింగ్ ఈఎన్టీ కేంద్రం, సమగ్ర క్యాన్సర్ వైద్య కేంద్రాలు ఇతర ఆధునిక సేవల కల్పన గురించి తయారు చేసిన ప్రతిపాదనల గురించి మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కు డిఎంఈ వివరించారు. రూ.180 కోట్ల అంచనా వ్యయంతో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. రూ. 65 కోట్ల అంచనా వ్యయంతో ఐసీయూల బలోపేతానికి గురించిన ప్రతిపాదనలు కూడా డిఎంఈ మంత్రి ముందు ఉంచారు. వీటిపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుతో చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
వెంటిలేటర్ల విషయంలో రాజీ పడొద్దు
రోగుల అవసరాలకు అనుగుణంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 850 వెంటిలేటర్లకు అదనంగా ఇంకా ఎన్ని అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. రోగుల ప్రాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
కేంద్ర అణుశక్తి శాఖ నుంచి నిధులు పొందేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలి
అనంతపురం, మచిలీపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, ఒంగోలులో కలిపి ఐదు సమగ్ర క్యాన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర అణుశక్తి శాఖ నుంచి పొందేందుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ
వైద్య విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల నిర్వహణకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలను సిద్ధం చేయాలని సూచించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీజీ సీట్ల మంజూరుకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదలైన రూ.343 కోట్లను త్వరగా వినియోగించి అవసరమైన పరికరాలను సమకూర్చాలని, నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల స్థాయి, రోగుల అవసరాలకు తగ్గట్టుగా సిటి స్కాన్లు, క్యాథ్‌ల్యాబ్‌లు, ఎంఆర్ఐలు ఎక్కడెక్కడ కావాలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టం చేశారు.
నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెరిగిన ఆర్థిక భారం
గత జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను అవసరాల మేరకు చేపట్టకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. అలాగే నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేయకుండా గాలికొదిలేసిందని పేర్కొన్నారు. దీని వల్ల కూటమి ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిందన్నారు.
రూ.7,369 కోట్ల నిధుల సమీకరణకు ప్రతిపాదనలు
బోధనాసుపత్రుల్లో చేపట్టిన నిర్మాణాలు, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇంకా మంజూరు కావాల్సిన నిధుల వివరాలను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ బలరామిరెడ్డి మంత్రికి వివరించారు. తొలి దశలో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రూ.2,340 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయ పథకం (సాస్కీ) కింద వచ్చే రూ.7,369 కోట్ల ఆర్థిక సహాయం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు డీఎంఈ విష్ణువర్ధన్ వివరించారు. 2027-28 ఆర్థిక సంవత్సరంలో రూ.2,499.97 కోట్లతో ప్రభుత్వ బోధనాసుపత్రులను ఆధునికీకరించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ విషయంలో…
గిరిజన ప్రాంతాల్లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను అక్కడి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఆర్ .వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు
