-గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
-రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం
-నెల్లూరు – తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది
-భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
-ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలి
-అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి.
అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
రైతుల్ని అప్రమత్తం చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వరి పంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున, వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలి.
ప్రజలు బీచ్‌ల వైపు వెళ్లకుండా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల తుపాను గాలుల్లో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారుల జీవితాలు విషాదాంతమైన విషయాన్ని ప్రస్తావించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు క్షేత్రస్థాయి సిబ్బందితో సహా యంత్రాంగమంతా గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల”ని ఆదేశించారు.
