గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో ఓటరు స్లిప్ లు పంపిణీ చేయాలని, వాటిని సిద్ధం చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు.
ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ, సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్ వలన కొంత మంది ఓటర్లు ఓటు హక్కు ఎక్కడ ఉందో సందిగ్ధావస్థలో ఉన్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలియజేసారని, ఇందుకుగాను క్యూ ఆర్ కోడ్ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
జెడ్.పీ.టీ.సీ, ఎం.పీ.టీ.సీ ఎన్నికలకు శుక్రవారం ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని, అందుకు రిటర్నింగ్ అధికారులు ముందస్తు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్ మరింత క్రియా శీలంగా పనిచేయాలని ఆదేశించారు. తర్ఫీదు పొందిన సిబ్బందిని వినియోగించాలని అన్నారు. వంద మీటర్ల దూరం విధిగా
పాటించాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో వచ్చే వారికి టోకెన్ లు జారీ చేయాలని సూచించారు. నామినేషన్లు పూర్తి జరిగిన వెంటనే స్క్రూటినీకి సిద్ధం కావాలన్నారు. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
శుక్రవారం పి.ఓలు, ఏ.పి.ఓలు శిక్షణ
జెడ్.పీ.టీ.సీ, ఎం.పీ.టీ.సీ ఎన్నికలకు సంబంధించి పి.ఓలు, ఏ.పి.ఓలకు మొదటి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ శిక్షణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
24, 25న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రాలు
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల మేరకు, పోస్టల్ బ్యాలెట్ జారీ చేయుటకు 24, 25వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటెషన్ కేంద్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.
సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఓటరు స్లిప్ పంపిణీపై దృష్టి సారించాలని అన్నారు. శత శాతం పంపిణీ జరుగుటకు శ్రద్ధ వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.
వ్యయ పరిశీలకులు నందిని సలారియా మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయాల నమోదు కచ్చితంగా జరగాలని అన్నారు.
పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు జరగరాదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి స్పష్టంగా అమలు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, నోడల్ అధికారులు
పాల్గొన్నారు.
