ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026 పటిష్ట అమలుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు

Lakshmisha

-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
-20 మంది అధికారులతో ఏర్పడిన జిల్లా స్థాయి కమిటీ
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు – 2026లను పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 లోని సెక్షన్ 5 కింద కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు కల్పించిన అధికారాలు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల మేరకు ఈ ప్రత్యేక సెల్‌ను తక్షణమే అమల్లోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ, వివిధ శాఖల మధ్య సమన్వయం, నిబంధనల అమలు లక్ష్యంగా 20 మంది కీలక అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా అటవీ అధికారి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, విద్యుత్ శాఖ ఈఈ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా రవాణా అధికారి, జిల్లా జీఎస్టీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఉన్నత విద్య సమన్వయకర్త, డిఆర్డిఎ., మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, జిల్లాలోని ఇతర మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు.

జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి, పారవేసే విధానాన్ని ప్రత్యేక సెల్ పర్యవేక్షిస్తుంది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, మాల్స్, పరిశ్రమలు, పెద్ద వాణిజ్య సంస్థలు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లు నిబంధనల ప్రకారం వ్యర్థాలను నిర్వహిస్తున్నాయా లేదా అనే అంశంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అటవీ ప్రాంతాలు, కొండలు, జలవనరులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను అక్రమంగా పారవేయడం, తగలబెట్టడాన్ని పూర్తిగా నిరోధించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతారు. జిల్లాలో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి వాటిని శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఉన్న పాత డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ పనులను వేగవంతం చేసి, వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తారు. అలాగే స్థానిక సంస్థల అనుమతి పొందిన, పూర్తిగా మూసి ఉన్న వాహనాల ద్వారానే చెత్త రవాణా జరిగేలా పర్యవేక్షిస్తారు. అనుమతి లేని వాహనాల ద్వారా వ్యర్థాల రవాణాను అనుమతించరు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా జరిమానాలు విధించడం, అనుమతి లేని వాహనాలను సీజ్ చేయడం, నిబంధనలు పాటించని సంస్థల మూసివేతకు సిఫార్సు చేయడం, అవసరమైన సందర్భాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలు చేపడతారు. పదేపదే నిబంధనలను ఉల్లంఘించే వారిపై పర్యావరణ చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక సెల్ కనీసం నెలకు ఒకసారి సమావేశమై జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణ అమలు తీరును, సాధించిన ప్రగతిని సమీక్షిస్తుంది. ప్రతి పక్షం రోజులకు ఒకసారి, నెలవారీగా సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026లను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఎన్టీఆర్ జిల్లాను పరిశుభ్రమైన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.