ఎన్‌టీఆర్ జిల్లాలో ఎరువుల పంపిణీకి నూతన విధానం ఎఫ్ ఎఫ్ ఎస్ ప్రారంభం

-ఇబ్రహీంపట్నంలో క్షేత్రస్థాయిలో అమలును పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్
-రైతులకు పారదర్శకంగా, సులభంగా ఎరువుల పంపిణీ చేయడమే ఎఫ్ ఎఫ్ ఎస్ విధానం లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్‌టీఆర్ జిల్లాలో ఎరువుల పంపిణీకి నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) విధానం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ విధానం అమలు తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ ఇబ్రహీంపట్నంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఏపీఎంఎస్ యాప్ స్థానంలో ఎఫ్ ఎఫ్ ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంపొందించి రైతులకు సులభంగా ఎరువులు అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. బుకింగ్‌కు ముందు ఏపీఎఫ్ఆర్ లో రైతు నమోదు తప్పనిసరి. పంట, భూమి విస్తీర్ణం వివరాలు నమోదు చేసిన అనంతరం అవసరమైన ఎరువుల సిఫార్సు పరిమాణాలు యాప్‌లో కనిపిస్తాయి. రైతులు 20 కిలోమీటర్ల పరిధిలోని ఎరువుల దుకాణాన్ని ఎంపిక చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక క్యూఆర్ కోడ్ జారీ అవుతుంది. దాని ద్వారా 48 గంటల్లోపు ఎరువులు కొనుగోలు చేయాలి. డీలర్లు e-POS యంత్రం ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎరువులను పంపిణీ చేస్తారు.

ఎరువుల విక్రయ కేంద్రాల్లో కమిషనర్ తనిఖీ
ఇబ్రహీంపట్నంలోని పిఎసిఎస్ ఎరువుల విక్రయ కేంద్రం, శ్రీ లాస్య ఏజెన్సీస్‌ను కమిషనర్ సందర్శించి ఎఫ్ఎఫ్ఎస్ విధానం ద్వారా జరుగుతున్న బుకింగ్, విక్రయ ప్రక్రియను పరిశీలించారు. హెల్ప్‌డెస్క్‌ల ద్వారా రైతులకు అందిస్తున్న సహాయాన్ని, క్యూఆర్ కోడ్ ద్వారా e-POS యంత్రంలో జరుగుతున్న విక్రయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి
వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఎరువుల డీలర్లు నూతన యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు. రైతులకు బుకింగ్ ప్రక్రియలో అవసరమైన సహకారం అందించాలని, ప్రారంభ దశలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువుల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం ఏడీఏ ఎం.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఏడీఏ, వ్యవసాయ అధికారి (టెక్నికల్), ఇతర అధికారులు పాల్గొన్నారు.