-ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
-ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరించాలి
-కమ్యూనిస్టు అభ్యర్థులనూ అడ్డుకోవడం దుర్మార్గం
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై సుప్రీం కోర్టు తీర్పును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్వాగతించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు వేసేటప్పుడు..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జరిగిన దాడులు, విధ్వంసాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆన్లైన్లోనూ నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 19 చోట్ల తిరిగి నామినేషన్లు స్వీకరించాలని, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు చేసిన ఆదేశాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చివరకు కభ్యూనిస్టు పార్టీల అభ్యర్థులకు సైతం నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం, అభ్యర్థులపై బలవంతంగా ఒత్తిళ్లు తెచ్చి ఉప సంహరింపజేస్తున్న తీరు అప్రజాస్వామికమని తప్పుపట్టారు. రాష్ట్రంలో మÖడు కూటముల కుమ్మక్కులో ప్రజాస్వామ్యం బలైపోతోందని పేర్కొన్నారు. పోలీసుల కూటమి, చంద్రబాబు నాయుడు కూటమి, ఎన్నికల కమిషన్ కూటమిగా నడుస్తున్నాయనితెలిపారు.ఆ మూడు కూటముల అధికార దాహానికి ప్రజాస్వామ్యం బలవుతోందని, హక్కులు కోల్పోతుందని పేర్కొన్నారు. పోలీసులే ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటే…ప్రజాస్వామ్యానికి రక్షకులెవరు?, పోలింగ్ బూతుల్లోకి వెళ్లిన అభ్యర్థులను సైతం పోలీసు అధికార యంత్రాంగమే బయటకు పంపుతున్న దుస్థితి నెలకొందన్నారు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదనీ, ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగమే అడ్డంకిగా మారితే ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా?, నామినేషన్లను అడ్డుకుంటూ, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కే దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకే అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాసే చర్యలను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఎన్నికలు నిర్వహించడమే కాదనీ, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటమే ఎన్నికల కమిషన్ అసలైన బాధ్యతని, ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఎలా నిలుస్తుందని పేర్కొన్నారు. అధికార దాహం… అవినీతి… రౌడీయిజం… దౌర్జన్యాలే ఎన్నికల ఎజెండాగా మారితే ప్రజల తీర్పుకు విలువెక్కడ?, ప్రజాస్వామ్యాన్ని అధికార బలంతో బందీ చేయడం పాలన్నారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కుతూ, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల ప్రక్రియను కలుషితం చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని, ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల పోటీ హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలు, ఎన్నికల నియమాలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఎవరికీ అధికారం లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిష్పక్షపాత విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో నగ్నంగా నిలబెడుతున్న అధికార దురహంకారానికి చరమగీతం పాడాలని, పోలీసుల కూటమి, అధికార కూటమి, ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై ప్రజలు ప్రశ్నించాలని, ప్రజాస్వామ్యాన్ని ప్రజలే పరిరక్షించుకోవాలని కోరారు.
