డీఎస్సీ పోస్టులు పెంచాలని విజయవాడలో డీవైఎఫ్‌ఐ నిరసన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో డీఎస్సీ అభ్యర్థులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం 2,721 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని విమర్శించారు. ఎస్జీటీ పోస్టులు పలు జిల్లాల్లో నామమాత్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.
డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని, అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని, గతంలో ఆమోదించిన స్పెషల్ డీఎస్సీ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. తక్షణమే నోటిఫికేషన్‌ను సవరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్, సీఐటీయూ, గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక నాయకులు మద్దతు తెలిపారు. పలువురు డీవైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.