గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
కార్తీక మాసంలో అఘోరా సాధువుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కే. బుచ్చిరాం ప్రసాద్ పేర్కొన్నారు.
కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని ఆయన తెలిపారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారని, శైవ సంప్రదాయ భక్తులు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తారని వివరించారు.
గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం (ఓపెన్ ఆడిటోరియం)లో డిసెంబర్ 7, 2026, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ హిందూ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అఘోరా సాధువులచే నిర్వహించనున్న కార్తీక మాస మహా రుద్రాభిషేక కార్యక్రమం విశేష ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు.
అఘోరా సాధువుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా భక్తులకు పరమశివుని ఆరాధనలో పాల్గొనే అరుదైన అవకాశం లభిస్తుందని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాల కొనసాగింపు కోసం కృషి చేస్తున్న అనిల్ బెహరా, 41వ వార్డు కార్పొరేటర్ గాయత్రి బెహరాలను ప్రత్యేకంగా అభినందించారు.
సనాతన ధర్మం మానవతా విలువలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఐక్యతను పెంపొందిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కే. బుచ్చిరాం ప్రసాద్‌తో పాటు గుంటూరు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, జాతీయ స్పైసెస్ బోర్డు డైరెక్టర్ కె.వి. సుబ్బారావు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
గుంటూరు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా రుద్రాభిషేక కార్యక్రమాన్ని తిలకించి పరమశివుని ఆశీస్సులు పొందాలని కే. బుచ్చిరాం ప్రసాద్ కోరారు.
కార్తీక మాసంలో మహా రుద్రాభిషేకం నిర్వహించడం అభినందనీయం : కే. బుచ్చిరాం ప్రసాద్
