ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యంపై మూడవ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం

-ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్‌పై దృష్టి సారించాలన్న సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్–సింగపూర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలులో భాగంగా నిర్వహించిన మూడో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ ప్రభుత్వ మంత్రి గన్ సియో హువాంగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో బుధవారం అమరావతి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ మంత్రి రాష్ట్రంలో భాగస్వామ్య కార్యక్రమాల పురోగతిని, ముఖ్యమంత్రి ముందుచూపును ప్రశంసించారు. మరోవైపు 2027 మార్చి నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగపూర్ బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల రంగాల్లో కొత్త హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల సంభవించిన తుపాను సమయంలో నాలుగు రోజుల్లోనే 30 వేల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించినట్లు వివరించారు.

సామర్థ్య పెంపు, నైపుణ్యాభివృద్ధిపై చర్చ

సింగపూర్‌లో మంత్రుల బృందం నిర్వహించిన కార్యక్రమం ఫలవంతంగా సాగిందని సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. సివిల్ సర్వీసెస్ సంస్కరణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని, ఏడుగురు జిల్లా కలెక్టర్లు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఇరు పక్షాలు సమన్వయంతో, పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. స్పష్టమైన మైలురాళ్లను నిర్దేశించుకుని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పురోగతిని సమీక్షించాలని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా 2027 మార్చి వరకు ఒక ప్రణాళిక, 2028 మార్చి వరకు మరో ప్రణాళికను ప్రాధాన్యతా క్రమంలో సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయి ఉత్తమ విధానాలు రాష్ట్ర ప్రజలకు చేరువవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.