-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
-పేద మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షల్లో శిక్షణ అందించడం అభినందనీయం
-మతసామరస్యం, సోదరభావానికి విజయవాడ నగరం ప్రతీక
-మైనారిటీల విద్యా, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆయన కార్యాలయం నందు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారుక్ షుబ్లీ, టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఫైజాన్‌తో పాటు పలువురు మైనారిటీ నాయకులు పాల్గొని మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… భారతదేశ విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశ విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశంలో తొలి ఐఐటీ అయిన ఖరగ్‌పూర్ ఐఐటీ ఏర్పాటుతో పాటు ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ యువత అత్యున్నత స్థానాల్లో నిలుస్తూ దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి ఆనాడు ఆయన వేసిన విద్యా పునాదులే స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.
విజయవాడ మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం
విజయవాడ నగరం గత వందేళ్లుగా మతసామరస్యం, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు దసరా, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను పరస్పర గౌరవం, స్నేహభావంతో కలిసిమెలిసి జరుపుకోవడం విజయవాడ ప్రత్యేకత అని అన్నారు. నగర అభివృద్ధిలో ముస్లిం సోదరుల భాగస్వామ్యం, వారి సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పనిచేయడం వల్లే విజయవాడ నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు కులమతాల కంటే అభివృద్ధి, సంక్షేమం, తమ పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిచ్చారని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం అప్పగించారని పేర్కొన్నారు.
పేద మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
పేద మైనారిటీ కుటుంబాల విద్యా, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉన్నత విద్యావకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 300 మంది ముస్లిం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో బ్యాచ్‌లో 150 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా విద్యార్థులకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ప్రముఖ ఐఐటీ, మెడికల్ కోచింగ్ సంస్థల ద్వారా నాణ్యమైన శిక్షణ అందించి, పేద విద్యార్థులు సైతం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చాటేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదు
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఎంపీ చిన్ని ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన శిక్షణ, ఉన్నత అవకాశాలు అందుబాటులో ఉండాలని అన్నారు. ముస్లిం సోదర సోదరీమణుల విద్యా, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.విజయవాడలో మతసామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులు, సామాజిక సంస్థలు సమష్టిగా కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.విద్య, ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం అనే లక్ష్యాలతో ముందుకు సాగినప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
