-ఫిబ్రవరి 28, 2027 వరకు కొనసాగింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా నివారణ, శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా ‘సాన్స్ (SAANS – Social Awareness and Action to Neutralize Pneumonia Successfully)–2026-27’ ప్రత్యేక ప్రచారం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 28, 2027 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 17.2 శాతం న్యుమోనియా కారణంగా సంభవిస్తున్న నేపథ్యంలో వ్యాధిని ముందుగా గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో అమలు చేయనున్నారు. వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు న్యుమోనియా గుర్తింపు, చికిత్సపై శిక్షణ ఇస్తారు. ఆశా కార్యకర్తలు ఇంటింటి సందర్శనల ద్వారా చిన్నారుల్లో వ్యాధి లక్షణాలను గుర్తించి, బాధితులకు తక్షణ వైద్య సేవలు అందేలా చూస్తారు. అవసరమైన వారిని ఉన్నత వైద్య కేంద్రాలకు పంపిస్తారు.
అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అమోక్సిసిలిన్, జెంటామైసిన్, యాంపిసిలిన్ వంటి మందులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV) మూడు డోసులు అందిస్తారు. తల్లిపాల ప్రాధాన్యత, చేతుల పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, వాయు కాలుష్య నివారణపై అవగాహన కల్పిస్తారు. గుర్తించిన కేసులు, చికిత్స వివరాలను ANM SAANS, MO SAANS యాప్‌లలో నమోదు చేస్తారు.
లక్షణాలను గుర్తించాలి
ఐదేళ్లలోపు చిన్నారుల్లో దగ్గు, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీ లోపలికి లాగబడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని చక్రధర్ బాబు సూచించారు. తల్లిపాలు అందించడం, నిర్ణీత సమయంలో టీకాలు వేయించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పొగ, దుమ్ము, వాయు కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా న్యుమోనియా ముప్పును తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ప్రాధాన్యతతో, వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
