-గ్రామాల్లో దెబ్బ తిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి
-తాగు నీటి సరఫరా, డ్రెయిన్ల ప్రవాహాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి
-అర్నబ్ తుపాను సహాయక చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో అంశాలవారీగా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-75 మండలాలు, 852 గ్రామ పంచాయతీలపై తుపాను ప్రభావం
-గ్రామాల్లో రహదారులపై పడిన చెట్లు 776, పారిశుద్ధ్య పనుల్లో 15,686 మంది సిబ్బంది
-సమీక్షలో పవన్ కళ్యాణ్ కి వివరించిన అధికారులు
-గ్రామాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన ఇబ్బందులు, రహదారులపై పడిన చెట్ల తొలగింపు, డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, వీధి దీపాల పునరుద్ధరణ తదితర అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
852 పంచాయతీలపై తుపాను ప్రభావం
మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన నివేదికల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 75 మండలాల పరిధిలోని 852 గ్రామ పంచాయతీలు తుపాను ప్రభావానికి గురైనట్లు అధికారులు వివరించారు. ప్రభావిత జిల్లాల్లో 539 లోతట్టు, తీర ప్రాంత, ముంపు ప్రమాద ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలను అంశాలవారీగా తెలుసుకుని అంశాల వారీగా దిశానిర్దేశం చేశారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులకు గ్రామీణ రహదారులపై 776 చెట్లు నేలకొరగగా, యుద్ధ ప్రాతిపదికన తొలగింపు ప్రక్రియ చేపట్టి, ఇప్పటివరకు 721 చెట్లను తొలగించినట్లు అధికారులు వివరించారు. కాకినాడ జిల్లాలో రోడ్లపై కూలిన 33 చెట్లను తొలగించామని, తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో కొంతమేరకు సహాయక చర్యలు ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన 55 చెట్లను కూడా బుధవారం సాయంత్రానికి తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు.
డ్రెయిన్లలో ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలి
తుపాను కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన 577 డ్రెయిన్లను గుర్తించగా, 528 డ్రెయిన్లలో అడ్డంకులను తొలగించినట్లు అధికారులు తెలిపారు. డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే, భారీ వర్షాలతో ఏర్పడిన నీటి నిల్వల తొలగింపు కష్టసాధ్యం అవుతుందని, మిగిలిన 49 డ్రెయిన్లను కూడా తక్షణం శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డ్రెయిన్లలో మురుగు నీరు నిల్వ ఉంటే ప్రజలు ఇబ్బందులుపడతారని, భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల నుంచి నీరు తక్షణం బయటకు వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. డ్రెయిన్లలో ప్రవాహాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులకు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వీధి దీపాల పునరుద్ధరణకు ప్రాధాన్యం
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో 566 వీధి దీపాలు దెబ్బతినగా, ఇప్పటివరకు 147 పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. అందులో కృష్ణా జిల్లాలో 136, శ్రీకాకుళంలో 210, అనకాపల్లిలో 85, విశాఖపట్నంలో 63, విజయనగరంలో 58, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 వీధి దీపాలు దెబ్బతిన్నట్లు వివరించారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణతోపాటు వీధి దీపాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు చెప్పారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పాములు, తేళ్ల వంటి విషపు పురుగుల సంచారం ఉండే అవకాశాలు ఉంటాయని, వీధి దీపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చీకటిపడే లోపు ఈ పనిని పూర్తి చేయాలని తెలిపారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
తుపాను అనంతరం గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అయితే అర్నబ్ ప్రభావిత జిల్లాల్లో 15,686 మంది పారిశుద్ధ్య సిబ్బందిని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2,358 పారిశుద్ధ్య బృందాలు, 1,103 తరలింపు బృందాలు తుపాను విధుల్లో ఉన్నట్టు వివరించారు. పారిశుద్ధ్య చర్యల కోసం 10,17,701 కిలోల బ్లీచింగ్ పౌడర్, 28,40,433 కిలోల సున్నం, 40,241 లీటర్ల క్లోరిన్ అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు.
గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిల్వ ఉన్న నీటిని తక్షణం ఇంజిన్ల సాయంతో తొలగించే ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల కారణంగా తాగునీటి వనరులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తుపాను ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పంపుసెట్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లు దెబ్బతిని ఉంటే వెంటనే పునరుద్ధరించాలని నిర్దేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయాలని, నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పునరుద్ధరణ పనులకు యంత్రాంగం సిద్ధం
అర్నబ్ ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలను వివరిస్తూ.. పునరుద్ధరణ చర్యల నిమిత్తం 4,325 అత్యవసర పరికరాలు, వాహనాలు, ఇతర వనరులను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనుల్లో 303 జేసీబీలు, క్రేన్లు, ప్రొక్లెయినర్లు, 550 ట్రాక్టర్లు, 233 వాటర్ ట్యాంకర్లు వినియోగిస్తున్నట్లు వివరించారు. వీటికి అదనంగా 487 జనరేటర్లు పనిచేస్తున్నాయని నివేదించారు. రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
