పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి

-పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం సాయంత్రం రెండవ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్టోబర్ 29, 30 తేదీల్లో మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇండోర్ స్టేడియంలోని ధ్యాన్‌చంద్ బ్లాక్‌లో నిర్వహించనున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిలో విజయవాడలో ఓటు హక్కు కలిగిన వారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. 2026, అక్టోబర్ 29, 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు, ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వచ్చే సిబ్బంది తమకు ఎన్నికల విధులు కేటాయిస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తో పాటు ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని కమిషనర్ తెలిపారు. ఓటర్లకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా సిబ్బంది వార్డు, ఓటర్ల జాబితాలోని క్రమ సంఖ్య తదితర వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది పాల్గొన్నారు.