ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల విధులు కేటాయించబడి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 27, 28 తేదీల్లో 807 మంది ఉద్యోగులు ఓటు హక్కుని వినియోగించుకున్నారని నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం కమిషనర్ స్థానిక ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత, పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ కేంద్రం వద్ద రద్దీ ఏర్పడకుండా ముందస్తుగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. అలాగే మొత్తం ఓటింగ్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా, ఎటువంటి ఆటంకాలు లేదా అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను నియమావళి ప్రకారం పక్కాగా సీలింగ్ చేసి, అత్యంత భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచడంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని, 27వ తేదీ 367 మంది, 28వ తేదీ 440 మంది వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల బాధ్యతల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి కూడా తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకునేలా ఏసీ కాలేజీలో అవసరమైన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్, ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.