ఓటర్ స్లిప్ ల పంపిణీలో ఎన్నికల నిబందనలు పాటించనివారిపై కఠిన చర్యలు…

-కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నమూనా ప్రవర్తనా నియమావళి (2026) పార్ట్ IV (పారా 2) మరియు రిటర్నింగ్ అధికారుల హ్యాండ్‌బుక్ 2026 నిబంధనల ప్రకారం పోలింగ్ రోజున పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఓటర్లకు పంపిణీ చేసే స్లిప్పులను కేవలం తెల్లటి కాగితంపై మాత్రమే ముద్రించాలని, వీటిపై ఏ అభ్యర్థి పేరు గానీ, రాజకీయ పార్టీ పేరు గానీ లేదా ఎన్నికల గుర్తు గానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశిత నిబందనల మేరకు ఐడెంటిటీ స్లిప్పులపై కేవలం ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, వార్డు సంఖ్య, పోలింగ్ కేంద్రం (బూత్) సంఖ్య మరియు ఓటర్ల జాబితాలోని ఓటరు వరస సంఖ్య అనే ఐదు వివరాలు మాత్రమే ఉండాలన్నారు. ఇప్పటికే నగరంలో కొన్ని పార్టీల అభ్యర్ధులు నిబందనలకు విరుద్ధంగా పార్టీ పేరు, గుర్తులతో స్లిప్ ల పంపిణీ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయని, పరిశీలించి నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్ (ఎస్డబ్ల్యూ)ని ఆదేశించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ గుర్తులు లేదా ప్రచార పూరిత సమాచారంతో కూడిన స్లిప్పులను పోలింగ్ కేంద్రాల వద్ద ఉపయోగిస్తే ఎన్నికల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికే జిఎంసి పరిధిలోని 596 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ కోసం 596 మంది బిఎల్ఓల ద్వారా బుధవారానికి 75 శాతం పంపిణీ పూర్తి చేశామని తెలిపారు.