– పారదర్శకంగా అధికారుల పనితీరు ఉండాలి
– జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ బుధవారం విజయవాడ నగరపాలక సంస్థలోని పట్టణ స్థానిక సంస్థ ఎన్నికల వ్యయ నిర్వహణ విభాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోటీచేస్తున్న అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను నిర్వహిస్తున్న షాడో రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా సభలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలకు సంబంధించి వీడియో సర్వైలెన్స్ బృందం (వీఎస్‌టీ) సేకరించిన ఆధారాలను, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుల పర్యవేక్షణలోని అకౌంటింగ్ బృందాల ఖర్చు లెక్కింపు కోసం ఉపయోగిస్తున్న తీరును ధ్రువీకరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు చక్రవర్తి పాల్గొన్నారు. ఎన్నికల వ్యయ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి పరిశీలకులు తగిన సూచనలు జారీచేశారు. విభాగం పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు ఆయన గుర్తించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు.
