-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. కలుషిత నీటి వినియోగం వల్ల కలరా, టైఫాయిడ్, అతిసారం, విరేచనాలు, హెపటైటిస్ ఏ, ఈ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ప్రజలు తప్పనిసరిగా శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలని, తాగునీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాత వినియోగించాలని సూచించారు. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రంగా ఉంచి, వాటికి మూతలు పెట్టాలని, ఆహార పదార్థాలను కప్పి ఉంచాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొన్నారు. కుళాయిలు, నీటి సరఫరా పైపుల వద్ద కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.
విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైనప్పుడు వైద్యుల సూచన మేరకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని వినియోగించాలని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తూ, సురక్షితమైన నీటిని వినియోగించడం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని కమిషనర్ ధ్యానచంద్ర విజ్ఞప్తి చేశారు.
