-స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
-పరిటాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరింత వేగంగా ముందుకు సాగాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి బలోపేతం కావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్తోనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. బుధవారం కంచికచర్ల మండలం పరిటాలలో జెడ్పీటీసీ అభ్యర్థి మోరకొండ ఏడుకొండలు, ఎంపీటీసీ అభ్యర్థులు షేక్ షఫీవుల్లా, తంగిరాల రమ్య, కోగంటి శివ నాగమల్లేశ్వరి ల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న దేవినేని ఉమా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని, గత ప్రభుత్వ విధ్వంసంతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని రెండేళ్లలో తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కంచికచర్ల మండల జెడ్పీటీసీ స్థానంతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
