అర్నబ్ తుపాన్‌పై ఆర్టీజీఎస్ నిరంత‌ర‌ పర్యవేక్షణ

-ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌తా చ‌ర్య‌ల‌పై సీఎం చంద్ర‌బాబు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, హోం మంత్రి అనిత స‌మీక్ష‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుపాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపట్టిన ముందస్తు సన్నద్ధత, ప్రజల భద్రత, అత్యవసర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, హోం మంత్రి వంగలపూడి అనితలు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాన్‌ పరిస్థితులను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సంస్థ న నుంచి అధికారులు జిల్లాల్ల‌లోని ప‌రిస్థితుల‌ను రేయింబ‌వ‌ళ్లు నిరంత‌రాయంగా ప‌ర్య‌వేక్షిస్తూ ఎక్క‌డా కూడా ఎలాంటి స‌మన్వ‌య లోపం లేకుండా చూస్తున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు 14 జిల్లాలకు 12 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో 2,131 తుపాన్‌ షెల్టర్లను సిద్ధం చేశారు. 18 జిల్లాల్లో 2.70 కోట్ల మంది మొబైల్‌ ఫోన్లకు నిరంతరం తుపాన్‌ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ 30,043 ఫిషింగ్‌ బోట్లను తీర ప్రాంతాల్లో నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఒక్క ఫిషింగ్ బోటు కూడా స‌ముద్రంలో లేకుండా జాగ్ర‌త్త‌లు పాటించారు.

వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 1,087 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. 8,281 అత్యవసర పడకలు, 1,274 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.

పాముకాటు బాధితులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో 21,536 యాంటీ స్నేక్‌ వీనం డోసులను అందుబాటులో ఉంచారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 1,351 మంది గర్భిణులను ఇప్పటికే సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా 2,613 నీటి ట్యాంకర్లు, 2,430 జనరేటర్లు, 4,448 ఆర్వో ప్లాంట్లను సిద్ధం చేశారు.

నిత్యావసర సరుకుల నిల్వలు.. రైతులకు సూచనలు

తుపాన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత తలెత్తకుండా 14,686 రేషన్‌ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ముందుగానే నిల్వ చేశారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని 35.96 లక్షల మంది రైతులకు సూచనలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం కలగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ వసతి గృహాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ముఖ్యంగా 419 గిరిజన హాస్టళ్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ హాస్టళ్లలో నివసిస్తున్న 88,083 మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

రహదారుల పునరుద్ధరణకు యంత్రాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావంతో చెట్లు కూలడం, రహదారులకు అంతరాయం ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రోడ్లు, భవనాల శాఖ 550 జేసీబీలు, 596 ఎలక్ట్రిక్‌ రంపాలను సిద్ధంగా ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,079 జలాశయాల వద్ద పరిస్థితులను అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, నీటిమట్టాలు తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు.

ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ

తుపాన్‌ సంబంధిత పరిణామాలు, జిల్లాల్లో ముందస్తు సన్నద్ధత, అత్యవసర సేవల లభ్యతను ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో చేపట్టిన ముందస్తు సన్నద్ధత చర్యలను ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్‌ కాటంనేని, ఆర్టీజీఎస్‌ సీఈఓ ప్రఖర్‌ జైన్‌ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్‌ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, అవసరమైన సమాచారాన్ని సంబంధిత జిల్లా యంత్రాంగాలకు చేరవేస్తున్నాయి. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించింది.