అర్నబ్ విపత్తుని సమర్థంగా ఎదుర్కోవాలి… : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-ప్రాణ నష్టం జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలి
-సాయంత్రంలోపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
-92 తుపాను ప్రభావిత ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
-పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలకు లోటు లేకుండా చూడాలి
-ఏలేరు వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి
-విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి
-సహాయక చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
-అర్నబ్ తుపాను సన్నద్ధతపై కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘అర్నబ్ అతి తీవ్ర తుపాను రూపంలో విపత్తు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా చూడటమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిర్దేశించారు అర్నబ్ తుపాను ప్రభావం, కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో చేపట్టిన ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, సహాయక బృందాల సంసిద్ధత, విద్యుత్, తాగునీరు, రహదారులు, వైద్య సేవలపై ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ తుపాను పరిస్థితిని వివరించారు… వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అర్నబ్ అతి తీవ్ర తుపాను అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నానికి యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవచ్చని వివరించారు. కాకినాడ, యానాం తీర ప్రాంతాల్లో సముద్రపు అలల ఉద్ధృతి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో వచ్చి ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
తీర ప్రాంతాల నుంచి తరలింపు వేగవంతం చేయాలి
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న తాళ్లరేవు, యు.కొత్తపల్లి, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, కరప, తొండంగి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఆరు తీర ప్రాంత మండలాల పరిధిలో గుర్తించిన 50 గ్రామాలు, లోతట్టు ప్రాంతాల కలిపి మొత్తం 92 ఆవాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. మొత్తం 15 వేల మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, సాయంత్రంలోపు ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, అందుకోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సముద్ర తీరానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని పూరిళ్లు, రేకుల ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని ముందుగా తరలించాలన్నారు. హోప్ ఐలాండ్‌లోని 40 మత్స్యకార కుటుంబాలను ఇప్పటికే పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.
పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
జిల్లాలో 176 ఆవాసాలకు అనుసంధానంగా 50,700 మందికి ఆశ్రయం కల్పించే సామర్థ్యంతో 101 తుపాను రక్షణ కేంద్రాలు, పాఠశాలలు, ఇతర భవనాలను గుర్తించినట్లు కాకినాడ కలెక్టర్ తెలిపారు. అదనంగా 114 సహాయక కేంద్రాలను గుర్తించామని వివరించారు. ప్రతి పునరావాస కేంద్రంలో తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం, విద్యుత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, దుప్పట్లు, చిన్నారులకు పాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 13,921 మంది వృద్ధులు, 9,542 మంది చిన్నారులు, 1,126 మంది గర్భిణులు, 1,226 మంది దివ్యాంగులను గుర్తించినట్లు అధికారులు వివరించగా, గర్భిణుల్లో ముఖ్యంగా ప్రసవ సమయం దగ్గర పడిన వారిని ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. తరలింపు కోసం సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను అవసరానికి అనుగుణంగా వినియోగించాలని పేర్కొన్నారు.
విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేయండి
తుఫాను ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. జిల్లాలో 39 బృందాలుగా 488 మంది సిబ్బందిని సిద్ధం చేశామని, 737 విద్యుత్ స్తంభాలు, 28 ట్రాన్స్‌ఫార్మర్లు, 12.3 కిలోమీటర్ల విద్యుత్ తీగలు, 57 పవర్ సాలు, 36 జనరేటర్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు. తుఫాను సమయంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లకు ముందస్తుగా సరఫరా నిలిపివేయాలని, పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, పునరావాస కేంద్రాలకు విద్యుత్ పునరుద్ధరణలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారీ గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉంచిన 166 జేసీబీలు, 191 క్రేన్లు, 238 ట్రాక్టర్లు, 56 టిప్పర్లు, 37 ప్రొక్లెయినర్లను ముందుగానే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో నాలుగు రోజుల పాటు సిబ్బంది మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ప్రత్యేక బాధ్యులను నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాలకు రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కొట్టుకుపోయినా వెంటనే స్పందించాలని, ప్రమాదకరమైన రహదారులు, లోలెవల్ కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. తీర ప్రాంతాల్లో అవసరమైన యంత్రాలను ముందుగానే అందుబాటులో ఉంచాలన్నారు.
• తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
తుఫాను సమయంలోనూ ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. గ్రామీణ తాగునీటి పథకాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు చేయాలని, పునరావాస కేంద్రాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 114 వాటర్ ట్యాంకర్లు, 157 ఫాగింగ్ యంత్రాలు, పారిశుధ్య పనుల కోసం 426 బృందాలను సిద్ధం చేసినట్టు కాకినాడ కలెక్టర్ తెలిపారు. తుఫాను అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా తక్షణ పారిశుధ్య చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు.
• మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు
తుపాను నేపథ్యంలో మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, తీర ప్రాంత ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తుపాను సమయంలో అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 108 ఆంబులెన్సులతో పాటు ప్రైవేటు ఆంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేంతవరకు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. క్లోరిన్ మాత్రలతో పాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పంటల నష్టం తగ్గించేలా రైతులకు ముందస్తు సూచనలు చేయాలని, కోతకు వచ్చిన పంటను సురక్షితంగా నిల్వ చేసుకోవాలని, పండ్లతోటల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
• పిఠాపురం నియోజకవర్గంలో తుఫాను సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి
తుఫాను నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన సహాయక, పునరావాస ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. యు.కొత్తపల్లి మండలంలో ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్, మూలపేట, కొమరగిరి తదితర ప్రాంతాల్లో 14 పునరావాస కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రివర్యులు సూచించారు. గొల్లప్రోలు మండలంలో వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతంలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
• ఏలేరు వరద ప్రవాహంపై నిరంతర నిఘా
భారీ వర్షాల నేపథ్యంలో ఏలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల, కాలువలు, డ్రైన్ల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఏలేరు నుంచి ప్రస్తుతం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, సాయంత్రానికి దశలవారీగా 5,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఏలేరు వరదల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ఎనిమిది మండలాల్లోని 41 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, బల్లీలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వరద ప్రవాహం ఉన్న సమయంలో ప్రజలు వాగులు, కాలువలు, కాజ్‌వేల వద్దకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూముల ద్వారా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన చోట సహాయక బృందాలను వెంటనే పంపాలన్నారు. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే అనుసరించాలని, అనవసరంగా బయటకు రావద్దని, తుపాను సమయంలో గాలుల వేగం తాత్కాలికంగా తగ్గినా సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.